వైఎస్‌ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర పార్థసారథిరెడ్డిది | Pulivendula YSRCP Leaders Fires on TDP: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వైఎస్‌ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర పార్థసారథిరెడ్డిది

May 25 2026 6:04 AM | Updated on May 25 2026 6:04 AM

Pulivendula YSRCP Leaders Fires on TDP: Andhra pradesh

మీడియాతో మాట్లాడుతున్న వేముల మండలం వైఎస్సార్‌సీపీ నాయకులు

అతడి తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది 

వైఎస్‌ జగన్, వైఎస్‌ అవినాష్‌పై అసత్య ఆరోపణలు తగవు 

పులివెందుల వైఎస్సార్‌సీపీ నాయకుల ఫైర్‌

పులివెందుల: టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వేముల మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ బయపురెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల భాకరాపురంలో వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర కలిగిన పార్థసారధిరెడ్డి తనకు దారుణమైన అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతూ వైఎస్‌ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నాడన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తాతను చంపిన వారిని తాను, తన తండ్రి పట్టించుకోలేదని ఇటీవల చెప్పారన్నారు. 

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 11 ఏళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారని, వారిద్దరూ తలచుకుంటే నువ్వు పులివెందుల ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగేవాడివా అని ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత రాయలసీమలో ఎక్కడా ఫ్యాక్షన్‌ ఉండకూడదని నిశ్చయించుకుని పూర్తిగా రూపుమాపారని చెప్పారు. కర్నూలు జిల్లాలో కాటసాని కుటుంబానికి, బిజ్జల పార్థసారథి కుటుంబానికి ఉన్న ఫ్యాక్షన్‌ రాజకీయాలకు కూడా వైఎస్‌ రాజీ కుదిర్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్‌ ద్వారా పార్థసారథిరెడ్డి, టీడీపీ నాయకులు రూ.కోట్లు దోచుకోలేదా అని ప్రశ్నించారు. గనుల కోసమే తమ పార్టీ నాయకుడు వేల్పుల రాముపై పార్థసారథిరెడ్డి హత్యాయత్నం చేశాడన్నారు. 

టీడీపీ నాయకులు ప్రతిసారి వివేకాను హత్య చేస్తున్నారని, గొడ్డలిపార్టీ అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసలు వైఎస్‌ వివేకాను ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. వైఎస్‌ వివేకాను చంపాల్సిన అవసరం వైఎస్‌ జగన్, వైఎస్‌ అవినాష్ రెడ్డిలకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి చనిపోయే ముందురోజు వరకు వైఎస్‌ జగన్, వైఎస్‌ అవినాష్‌ గెలుపు కోసం పనిచేశారన్నారు. అసలైన వెన్నుపోటు పార్టీ టీడీపీయేనన్నారు. ఇప్పటికైనా పార్థసారథిరెడ్డి నిరాధారణమైన ఆరోపణలు, ప్రేలాపనలు మానుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో వేముల చెరువు నీరు లేకుండా కనపడిందా, ప్రస్తుతం ఆ చెరువు పరిస్థితి ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఎవరేమిటో ప్రజలు గమనిస్తున్నారని, తమతో పోటీ పడాలంటే అభివృద్ధిలో పోటీపడాలన్నారు. 

పార్థసారథిరెడ్డి ఇకపై చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. కార్యక్రమంలో వేముల మాజీ సర్పంచ్‌ రాఘవరెడ్డి, ఎంపీపీ గంగాదేవి వెంకటనారాయణ, ఎంపీటీసీలు మల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, గంగిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు మదర్సావలీ, రాధాకృష్ణయ్య, డీసీసీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆంజనేయులు, కో–ఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌పీరా, వైఎస్సార్‌సీపీ నాయకులు చలమారెడ్డి, రాజారెడ్డి, చలపతి, నాగభూషణం, గంగాధర్, మల్లారెడ్డి, శ్రీనివాసులు, శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement