
తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ ముసుగులో ప్రజాధనం దోపిడీ
3,850 క్యూసెక్కులకు సామర్థ్యం పెంచే పనులు 2017 ఏప్రిల్ 20న చేపట్టిన నాటి టీడీపీ సర్కార్
2019 ఫిబ్రవరి 18 నాటికే 2.73 కోట్లకుపైగా క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తి చేసినట్టు లెక్కలు
అప్పట్లో చేసిన పనులకు రూ.435 కోట్లకుపైగా బిల్లుల చెల్లింపు
ఇప్పుడు మళ్లీ ప్రధాన కాలువలో విస్తరణ పనులంటూ మాయాజాలం
టీడీపీ ఎంపీ వేమిరెడ్డి, మరో కాంట్రాక్టు సంస్థకు రూ.695.53 కోట్లతో పనులు అప్పగింత
1.22 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 19.74 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని లక్ష్యం
గతంలో చేసిన పనులకు పైపైన చేసి.. కొత్తగా చేసినట్లు చూపుతూ బిల్లులు
1.09 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 2.34 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసినట్లు షో
కాంట్రాక్టు సంస్థలతో కలిసి రూ.వందల కోట్ల దోపిడీకి ముఖ్య నేత పావులు
హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ పనుల్లో కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేత ప్రజా ధనాన్ని దోచేస్తున్నారనడానికి పై ఫొటోలే నిలువెత్తు నిదర్శనం. చేసిన పనికి కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించడం న్యాయం. గతంలో చేసిన పనికి మళ్లీ కొత్తగా బిల్లు చెల్లించడం అక్రమం. హంద్రీ–నీవా సుజల స్రవంతి తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ ఈ అక్రమాలకు వేదికైంది.
తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ ముసుగులో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి చెందిన డీఎస్సార్–వీపీఆర్ (జేవీ) కన్‌స్ట్రక్షన్స్, మేఘా కాంట్రాక్టు సంస్థలతో కలిసి ముఖ్య నేత భారీ ఎత్తున ప్రజాధనం దోపిడీ చేస్తున్నారు. కాలువ గట్లపై ముళ్ల పొదలు, పిచి్చమొక్కలు తొలగించి (జంగిల్ క్లియరెన్స్).. వెడల్పు చేసినట్లు పైపైన పొక్లెయిన్‌తో మట్టి తీసి.. గట్టు (ఎంబాక్‌మెంట్) వేయాల్సిన చోట బలహీనమైన (నాసిరకం) మట్టిని తెచ్చి కుప్పగా పోసి.. బిల్లులు చేసుకుంటూ నీకింత–నాకింత అంటూ పంచుకుతింటున్నారు.
సాక్షి, అమరావతి : హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ పనుల్లో అడుగడుగునా అవినీతి వరద పరవళ్లు తొక్కుతోంది. మట్టి గట్టు (ఎంబాక్‌మెంట్) ఏర్పాటు చేయాల్సిన చోట సక్రమంగా రోలింగ్ చేయకపోవడం వల్ల ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే కర్నూలు జిల్లా మద్దికెర మండల కేంద్రానికి సమీపంలో ప్రధాన కాలువ కోతకు గురై గండ్లు పడటం పనుల్లో నాణ్యతను బహిర్గతం చేస్తోంది. పాత పనులనే కొత్తగా చేసినట్లు సృష్టించి.. బిల్లులు చేసుకుని..పంచుకు తింటున్నారనే చర్చ జల వనరుల శాఖ అధికార వర్గాల్లో సాగుతోంది.
ఈ నెలలో మల్యాల పంప్‌హౌస్ నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడం ద్వారా తమ అక్రమాలను జల సమాధి చేసి బయటకు కనపడకుండా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులను టీడీపీ సర్కార్ హయాంలో 2017లో చేపట్టారు. 2019 ఫిబ్రవరి 18 నాటికే 2,73,32,444 క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయింది. ఈ పనులకు రూ.435 కోట్ల మేర బిల్లులు చెల్లించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
కానీ.. ఇప్పుడు మళ్లీ కొత్తగా హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులను రూ.695.53 కోట్లతో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన డీఎస్సార్–వీపీఆర్ కన్‌స్ట్రక్షన్స్, మేఘా సంస్థలకు అప్పగించారు. గతంలో అంటే 2019 ఫిబ్రవరి నాటికి పూర్తయిన పనులనే ఇప్పుడు కొత్తగా చేసినట్లు చూపి రూ.వందల కోట్లు కాజేసేందుకు వ్యూహం రచించారు.
విస్తరణ పూర్తయినట్లు మాయాజాలం
హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువను 0 కిలోమీటర్ నుంచి 216.3 కిలోమీటర్ (జీడిపల్లి రిజర్వాయర్) వరకు 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లకు వెడల్పు చేసి, ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచుతామని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఇదే పనులను 2017లో చేపట్టి 2019 ఫిబ్రవరి నాటికే దాదాపుగా పూర్తి చేశామని అప్పట్లో టీడీపీ సర్కార్ ప్రకటించింది.
అంటే.. అప్పట్లోనే కాలువను వెడల్పు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు కాలువను విస్తరించే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. ఒకటో ప్యాకేజీ (0 నుంచి 88 కి.మీ వరకు) కింద రూ.255.79 కోట్లకు మేఘా సంస్థకు, రెండో ప్యాకేజీ (88 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) కింద రూ.439.74 కోట్లకు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్–డీఎస్సార్(జేవీ) సంస్థకు కూటమి సర్కారు అప్పగించింది. ప్రధాన కాలువను వెడల్పు చేయడంతోపాటు బ్రిడ్జిలు, అక్విడెక్టులు వంటి కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట.. వాటికి అటూ ఇటూ వంద మీటర్ల పొడవున కాలువకు లైనింగ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.
ఒకటో ప్యాకేజీలో 37.79 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 5.61 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. రెండో ప్యాకేజీలో 84.97 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 14.13 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లెక్క కట్టింది. కానీ.. కాలువ గట్లపై ముళ్ల పొదలు తొలగించి, ఇన్‌స్పెక్షన్ పాత్ (తనిఖీ మార్గం)ను సరి చేసి.. పొక్లెయిన్‌తో అక్కడక్కడ తవ్వి.. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్లు కాంట్రాక్టర్లు మాయజాలం చేశారు.
ఈ నెల 4 నాటికే ఒకటో ప్యాకేజీలో 32.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 2.10 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. రెండో ప్యాకేజీలో 76.88 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1.24 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తయినట్లు చూపి.. వెరసి రెండు ప్యాకేజీల్లో ఈ నెల 4 నాటికే 1.09 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 2.34 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసినట్లు చూపి బిల్లులు చేసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రాయలసీమకు తీరని ద్రోహం
» హంద్రీ–నీవా తొలి దశ పనులు 2009 నాటికే పూర్తవడంతో 2012 నుంచి నీటిని తరలిస్తున్నారు. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పూర్తి సామర్థ్యం మేరకు హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి.. సీమను సస్యశ్యామలం చేసింది.
» చంద్రబాబు సర్కార్ 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ హంద్రీ–నీవా ద్వారా సామర్థ్యం మేరకు నీటిని తరలించిన దాఖలాలు లేవు. ఇప్పుడూ అదే కథ. 2024–25 నీటి సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు 1,575.62 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గతేడాది ఆగస్టు 2 నుంచి ఈ ఏడాది మార్చి 10 వరకు రోజుకు కనిష్ఠంగా 253 నుంచి గరిష్ఠంగా 2,530 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయడం వల్ల 222 రోజుల్లో కేవలం 29.08 టీఎంసీలను మాత్రమే తరలించగలిగింది. శ్రీశైలం ప్రాజెక్టులో ఏడాదికి 33 టీఎంసీల నీళ్లు ఆవిరవుతాయి. అంటే.. శ్రీశైలంలో ఆవిరయ్యే నీటి కంటే 3.92 టీఎంసీలను తక్కువగా హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు తరలించినట్లు స్పష్టమవుతోంది.
» శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజులపాటు 3,850 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోస్తేనే హంద్రీ–నీవా ద్వారా సీమకు 40 టీఎంసీలు అందించవచ్చు. హంద్రీ–నీవాపై ఆధారపడి చేపట్టిన భైరవానితిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, 68 చెరువుల పథకం, కర్నూలు నగరానికి తాగునీటి కోసం గాజులదిన్నెకు 3 టీఎంసీల తరలింపు తదితర ప్రాజెక్టులకు మరో 25 టీఎంసీలు అవసరమని ప్రభుత్వమే తేల్చింది. అంటే.. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 65 టీఎంసీలు ఎత్తిపోయాలి. ఆ 65 టీఎంసీలను హంద్రీ–నీవాకు సరఫరా చేయాలంటే శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 196 రోజులు ఎత్తిపోయాలి.
» కానీ.. అన్ని రోజులు వరద ప్రవాహం ఉండదు. ఎడమ గట్టు కేంద్రం నుంచి తెలంగాణ జెన్‌కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తోంది. ఈ నేపథ్యంలో హంద్రీ–నీవా సామర్థ్యాన్ని కనీసం 6,300 క్యూసెక్కులతో చేపడితేనే దానిపై ఆధారపడ్డ కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే ఆ ఆరు రాయలసీమ జిల్లాలు ఎడారిగా మారతాయని.. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 నుంచి 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయడం ద్వారా చంద్రబాబు రాయలసీమకు మరోసారి తీరని ద్రోహం చేశారని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.
కమీషన్ల కోసం ప్రవాహ సామర్థ్యం కుదింపు
వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల వర్షాలు కురిసే రోజులు తగ్గాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజులు తగ్గాయి. వర్షం కురిస్తే కుంభవృష్టి కురవడం.. కృష్ణా వరదెత్తడం జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో గరిష్ఠ స్థాయిలో నీటిని ఒడిసి పట్టి హంద్రీ–నీవా నుంచి రాయలసీమకు తరలించేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువ (0 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టేందుకు రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. ఒకటో ప్యాకేజీ (0 నుంచి 88 కి.మీ వరకు) కింద రూ.2,484 కోట్లకు మేఘా సంస్థకు, రెండో ప్యాకేజీ (88 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) కింద టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన డీఎస్సార్–వీపీఆర్(జేవీ)కి అప్పగించింది. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయడం గమనార్హం. ఆ మేరకే పనులు చేపట్టాలని ఆ కాంట్రాక్టు సంస్థలకు నిర్దేశించింది. కమీషన్ల కోసమే ప్రవాహ సామర్థ్యాన్ని కుదించారని.. ఇప్పుడు గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్లు చూపి బిల్లులు చేసుకుంటున్నారని సాగు నీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు.
పాత పనికి కొత్త బిల్లు!
ఇది నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలో హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ. కాలువ గట్లపై ముళ్ల పొదలు తొలగించారే గానీ, విస్తరించేలా పొక్లెయిన్‌తో తట్టెడు మట్టి కూడా తవ్వలేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. ఆ కాలువను 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లకు వెడల్పు చేసినట్లు కాంట్రాక్టర్లు మాయాజాలం చేసి, బిల్లులు చేసుకున్నారు.
ఇది అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముషూ్టరుకు సమీపంలోని హంద్రీ–నీవా ప్రధాన కాలువ. కాలువ సైడ్ స్లోప్స్ (ఏటవాలు)లో అక్కడక్కడ రాళ్లు అటూ ఇటూ జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తగా కాలువను వెడల్పు చేస్తూ పనులు చేసిన దాఖలాలే లేవు. కానీ.. కాలువను వెడల్పు చేసినట్లు కాంట్రాక్టర్లు చిత్రీకరించి, బిల్లులు చేసుకోవడానికి సిద్ధమయ్యారు.