
ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో రైలులోనే ప్రసవం
రైల్వే డాక్టర్ చొరవతో తల్లీబిడ్డ క్షేమం
జెమ్స్ ఆస్పత్రిలో మరో బిడ్డ జనన
ముప్పై నిమిషాలు ఆమదాలవలస స్టేషన్ ఉత్కంఠతో ఊపిరి బిగపట్టి చూసింది. నిత్యం రైల్వే అనౌన్స్‌మెంట్లతో మార్మోగే ఆ ప్రాంగణం ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు గమనించింది. సమయానికే స్టేషన్‌కు వచ్చిన రైలు అక్కడే ఆగిపోవడం, నిమిషాలు గడిచిపోతున్నా కదలకపోవడం, ఓ గర్భిణికి రైలులోనే ప్రసవం జరుగుతోందని స్టేషన్ అంతా తెలియడం, పండంటి ఆడపిల్ల పుట్టిందని సమాచారం రావడం వంటి ఘటనలతో ముప్పై నిమిషాలు మూడు ఘడియల్లా గడిచిపోయాయి. కాసింత జాప్యానికే తిట్టుకునే ప్రయాణికులు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆలస్యాన్ని అంతగా పట్టించుకోలేదు.
ఆమదాలవలస / శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రాత్రి రైలులో ఓ గర్భిణి ప్రసవించారు. ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ అరుణ, రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ పల్ల కీర్తి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురానికి చెందిన జి.భూలక్ష్మి అనే గర్భిణి తన భర్త జానకిరామ్‌తో కలిసి విశాఖ వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. దారిలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌లో ఆమె భర్త రైల్వే ఆర్‌పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో రైలును స్టేషన్‌లో నిలుపుదల చేసి రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ కీర్తికి సమాచారం అందించారు. ఆమె హూటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నొప్పులు అధికం కావడంతో రైలులోనే ప్రసవంచేశారు. ఆడబిడ్డ జన్మింగా తల్లి గర్భంలో మరో శిశువు ఉన్నట్లు వైద్యురాలు గుర్తించారు. దీంతో వారిని వెంటనే రాగోలు జెమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. సంఘటనను రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు అంతా వింతగా గమనించారు. దాదాపు 30 నిమిషాల పాటు రైలును ఆపేశారు.