
చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం..
సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్‌ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో..

గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్‌దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..
కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.
అయ్యో లక్షిత్
లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది.

మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే..
ఎవరి పని?
బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్‌ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్‌వాడీ టీచర్లపైనే లక్షిత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విషాదంలో రెండు ఊర్లు
కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
లక్షిత్ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్‌ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.