పోస్టు కోవిడ్‌ బాధితుల్లో వెంటాడుతున్న దుష్ఫలితాలు.. అకస్మాత్తుగా గుండెపోటు, పక్షవాతం

Post Covid 19 Symptoms After Recovery Health Effects - Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా వచ్చి తగ్గిన తర్వాత బాధితుల్లో దుష్ఫలితాలు వెంటాడుతూనే ఉన్నాయి. సైలెంట్‌ కిల్లర్‌లా ప్రాణాపాయం సృష్టిస్తున్నాయి.  కరోనా వచ్చిన వాళ్లలో ఆ వ్యాధి ప్రభావం శరీరంలోని మెదడు, గుండె, కాలేయం, కిడ్నీ, ఎముకలు, చర్మం ఇతర అవయవాలపై మిగిలే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే కరోనాకు గురైన యువతలో అకస్మాత్తుగా గుండెపోటు రావడమో, పక్షవాతానికి గురవడమో, కిడ్నీలు ఫెయిలవడం ఉంటుందని వైద్యులు అంటున్నారు.

కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై, దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. కరోనాకి గురైన వాళ్లు పూర్తిగా కోలుకున్నామని భావించకుండా ఆరోగ్యరీత్యా ఏమైనా తేడాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.  

నాడీ మండల వ్యాధులు..
కరోనా వచ్చిన వారిలో మెదడు, నాడీ మండల వ్యాధులు కలగడం సహజమని వైద్యులు అంటున్నారు. పోస్టు కోవిడ్‌ రోగుల్లో ఎక్కువ మందిలో తలనొప్పి నెలలు తరబడి ఉండటం అతి సాధారణ విషయమంటున్నారు. ముక్కుకి ఎలాంటి వాసన తెలియక పోవడం, నోరు రుచి తెలియక పోవడం కూడా కరోనాలో నాడీ వ్యవస్థకి సంబంధించిన జబ్బేనంటున్నారు.

మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు పగిలిపోవడం, పక్షవాతం రావడం, నరాల తిమ్మిర్లు, మంటలు కలగడం అతి సాధారణంగా చెబుతున్నారు. సైకోసిస్, డెలీరియం వంటి మానసిక వ్యాధులు కూడా కలగడం ఎక్కువ అంటున్నారు.  

శ్యాసకోశ , ఇతర సమస్యలు..
పోస్టు కోవిడ్‌ రోగుల్లో శ్యాసకోశ వ్యాధుల విషయానికొస్తే వారాలు, నెలలు తరబడి దగ్గు, ఆయాసం ఉంటుందని అంటున్నారు. జీర్ణకోశ సంబంధిత బాధల్లో వికారం, నీళ్ల విరోచనాలు వారాలు, నెలల తరబడి ఉండొచ్చు. కీళ్లనొప్పుల బాధ ఎక్కువుగా ఉండటం, అంతుబట్టని స్కిన్‌రాష్‌ రావడం జరుగుతుంది.

గుండెనాడీ వేగంగా కొట్టుకోవడం, గుండెదడ, ఛాతీలో నొప్పి, చిన్నపాటి పనికే ఆయాసం రావడం, పనిచేయలేక పోవడం వంటి సమస్యలు ఉంటున్న వారిని చూస్తున్నామని వైద్యలు అంటున్నారు. కొందరు అకస్మిక గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నట్లు చెపుతున్నారు.  

ఇమ్యునిటీ మెకానిజం దెబ్బతినడంతోనే 
కరోనా వలన ఇమ్యునిటీ మెకానిజం దెబ్బతినడమే దుష్ఫలితాలన్నింటికీ మూలకారణం. కరోనా వచ్చి తగ్గిన వారు ఆరోగ్య నియమాలు పాటించాలి. ఆహార నియమాలు సక్రమంగా పాటించడం అత్యంత అవసరం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఆరోగ్యరీత్యా ఏమైనా తేడాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నాడీ మండల వ్యాధులు ఇంకా పోస్టుకోవిడ్‌ రోగులకు వెంటాడుతూనే ఉన్నాయి.  
– డాక్టర్‌ డి.సుధీర్‌ చక్రవర్తి, ఇంటర్వెన్షనల్‌ న్యూరాలజిస్టు  

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top