అనకాపల్లి జిల్లా: హోంమంత్రి నియోజకవర్గంలో ఎన్ని ఘోరాలు జరిగినా చేతులు ముడుచుకుని కూర్చోవాలన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వార్తలు రాసే విలేకర్లకు నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. దీనికి ఉదాహరణ ఈ నెల 20వ తేదీన పాయకరావుపేట కంటోన్మెంట్ ఏరియాలో దళిత మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేరోజు లీడర్ పత్రికలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్టు వార్త ప్రచురితమైంది. ఈ వార్త రాసిన పాయకరావుపేట విలేకరి బి.రమేష్ బాబుకు పోలీసులు బిఎన్‌ఎన్ చట్టం 179కింద పాయకరావుపేట స్టేషన్ హౌస్ ఆఫీసరు పేరుతో నోటీసు ఇచ్చారు. ఈనెల 26వ తేదీన స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
బాధితులు తెలిపిన వివరాలు, తమకు అందిన సమాచారం మేరకు వార్త రాస్తే జరిగిన ఘటనపై మీకు అవగాహన ఉందని స్టేట్‌మెంట్ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు లైంగిక దాడిని సెల్‌ఫోన్ వివాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో కేసు సెక్షన్‌లు వేసి నిందితులు ఇద్దరిని ఆదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బాలికపై జరిగింది లైంగికదాడి కాదని సెల్‌ఫోన్ వివాదమని..దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మరుసటిరోజు నర్సిపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వివరణ ఇచ్చినప్పటికీ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ శంకర్రావు కూడా ఫిర్యాదు అందింది, పోక్సో కేసు కాబట్టి గోప్యత పాటిస్తున్నాం అని తెలిపారు.
పోలీసులే పోక్సో కేసు వర్తిస్తుందంటూ కేసు నమోదు చేసినప్పుడు వార్త రాసిన విలేకరికి నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్న వాదన వినిపిస్తోంది. హోం మంత్రి నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో మంత్రి మెప్పుకోసమే ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి అనిత కూడా ఇటీవల దళిత బాలికపై జరిగింది అత్యాచారం కాదంటూ చెప్పడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తెను నిందితులు కొబ్బరితోటలోకి తీసుకెళ్లి కొట్టడంతో పాటు, లైంగిక దాడికి పాల్పడ్డారని, శరీరంపై గాయాలు కూడా ఉన్నాయంటూ బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొంది. మంత్రి నియోజకవర్గంలో భవిష్యత్‌లో ఎటువంటి వ్యతిరేక వార్తలు రాయకూడదన్న బెదిరింపు ధోరణితోనే విలేకరికి పోలీసులు నోటీసులు ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


