బాబు బినామీలకు ‘ప్రైమ్‌ ప్లాట్లు’ రైతులకు పాట్లు: మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం | Perni Nani Comments on Chandrababu about Amaravathi Farmers Problems | Sakshi
Sakshi News home page

బాబు బినామీలకు ‘ప్రైమ్‌ ప్లాట్లు’ రైతులకు పాట్లు: మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం

May 12 2026 5:56 AM | Updated on May 12 2026 5:56 AM

Perni Nani Comments on Chandrababu about Amaravathi Farmers Problems

రెండో దశ ల్యాండ్‌ పూలింగ్‌కు మేం వ్యతిరేకం

రైతుల తరపున వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది 

ఏడాదిలో ప్యాలెస్‌ కట్టుకున్న చంద్రబాబు అద్దాల పేరుతో రాజధానిలో దోచేస్తున్నారు 

క్విడ్‌ ప్రో కో కోసమే అమరావతి తంతు  

రైతులను గెటవుట్‌ అని పెమ్మసాని అవమానించడం సిగ్గుచేటు  

ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రధానమంత్రి పొరుగు రాష్ట్రంలోని వారి ఇళ్లకు వెళ్లడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి.. చంద్రబాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ వ్యవస్థీకృత వివక్షకు తెర తీశారని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. అమరావతిలో భూములిచ్చిన సామాన్య రైతులకు వెస్ట్‌ బైపాస్‌ పక్కన ప్లాట్లు ఇస్తే.. చంద్రబాబు అనుచరులకు మాత్రం సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో భూములు కేటాయించారన్నారు. చంద్రబాబు తన ఇంటి పక్కన రైతులు ఎవరూ ఉండకూడదని 3,800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే గ్రీన్‌ బెల్ట్‌గా మార్చేశారన్నారు.

కోర్‌ క్యాపిటల్‌ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో తన ప్యాలెస్‌ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు రాజధానిలో అద్దాల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సూచించిన ఆచరణ సాధ్యమైన ‘మావిగన్‌’ ప్రతిపాదనను పక్కనపెట్టి చంద్రబాబు కేవలం క్విడ్‌ ప్రో కో కోసమే అమరావతి తంతు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని  మీడియాతో మాట్లాడారు.

సామాన్యులకు ఒక నీతి... బాబుకు ఒక నీతి..
‘సీఆర్‌డీఏ నిబంధనలు సామాన్య రైతులకు సంకెళ్లులా మారాయి. రైతులు తమ ప్లాట్లను వారసులకు ఇవ్వటానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రాసిన చంద్రబాబు తన బినామీలకు మాత్రం అన్ని రూల్స్‌ పక్కనపెట్టి మేలు చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏ స్థాయిలో చంద్రబాబు దోచుకుంటున్నారో చెప్పేందుకు ఆయన కడుతున్న ప్యాలెసే నిదర్శనం. నక్కపల్లిలో రూ. 600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్‌ పొందిన అట్లూరు శ్రీనివాసే చంద్రబాబు ఇల్లు కడుతున్నారు. ఇది క్విడ్‌ ప్రో కో కాదా? ఏడాదిలోనే బాబు ఇంటి సివిల్‌ పనులు పూర్తయ్యాయి కానీ రాజధాని భవనాలు మాత్రం అతీగతీ లేవు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసేందుకు ప్రధానమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం’ అని పేర్ని అన్నారు.  

రెండో విడత పూలింగ్‌కు వ్యతిరేకం..
‘అమరావతి పేరుతో ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పు చేశారు. 8 నుంచి 10 శాతం వడ్డీకి ఇంకా అప్పు తెస్తున్నారు. కేవలం అద్దాల కోసమే రూ.2,500 కోట్లు ఖర్చు చేయడం ఏ రకమైన అభివృద్ధి? అమరావతిని రాష్ట్రానికి ఒక గుదిబండలా తయారు చేస్తున్నారు. అమరావతిలో రెండో దశ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. జగన్‌ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ భూములను నిషే ధిత జాబితా నుంచి తొలగిస్తారు. కేంద్ర మంత్రి పెమ్మ సాని రైతులను గెటవుట్‌ అని అవమానించడం సిగ్గు చేటు. రూ.వందల కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చు కున్నంత మాత్రాన రైతులను అవమానించే హక్కు లేదు. రైతుల కళ్లల్లో నీరు రాష్ట్రానికి అరిష్టం. రెండో దశ ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో వారిని వేధిస్తే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు’ అని పేర్ని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement