
రీ వెరిఫికేషన్‌కు హాజరుగాని వారికి నిలిపివేత
డబ్బు విడుదల చేసినట్టు ప్రకటించి, పంపిణీ చేయవద్దని ఆదేశాలు
పింఛన్ల పంపిణీలో సర్కారు కొత్తపుంతలు
సాక్షి, అమరావతి: పింఛన్ల సంఖ్యను తగ్గించడానికి కూటమి సర్కారు కొత్తపుంతలు తొక్కుతోంది. కొత్తవి ఇస్తామంటూ పాతవాటికి కోత వేస్తోంది. దివ్యాంగులందరికీ పింఛను నిధులు విడుదల చేశామని ప్రకటిస్తూనే.. వేలాదిమందికి పంపిణీ చేయవద్దని అధికారులను ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పేదలు పింఛను మంజూరుకు కొత్తగా అర్హత వచ్చినా కనీసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే, అతడి భార్యకు స్పౌజ్ కేటగిరిలో కొత్తగా పింఛను ఇవ్వాలంటే.. ఉన్న పింఛనుదారులకు కోత పెట్టడం ద్వారా భారం తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది.
ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చే పింఛన్లు దాదాపు ఐదులక్షలు తగ్గిపోగా.. స్పౌజ్ కేటగిరిలో మూడు, నాలుగు నెలలుగా ఇదిగో ఇస్తున్నామంటూ ఊరించి, ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేసేందుకు 1.09 లక్షల మందికి కొత్తగా మంజూరు చేసింది. వాటిని అలా మంజూరు చేసిందో లేదో.. ఇప్పటివరకు ఏళ్ల తరబడి పింఛను తీసుకుంటున్న దివ్యాంగులు, మంచం నుంచి కదల్లేని స్థితిలోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కేటగిరిలో ఉన్నవారికి వేలసంఖ్యలో పింఛన్లు నిలిపేసింది. నోటీసులకు స్పందించలేదనే సాకు చెబుతోంది.
సంఖ్యపరంగా గొప్పగా చెప్పుకోవడానికి ఆగస్టులో పంపిణీ చేయకూడదని నిలిపివేసిన వారితో కలిపి అందరికీ డబ్బులు విడుదల చేసినట్టు ప్రకటించారు. కానీ వారికి పంపిణీ చేయవద్దని జిల్లా అధికారులు, పంపిణీ సిబ్బందికి ఉన్నతాధికారులు ముందే ఆదేశించారు. కదలలేని స్థితిలోనో లేదంటే మంచానికే పరిమితమై ఉండే పెరాలసిస్, తీవ్ర కండరాల బలహీనత తరహా రోగులతోపాటు దివ్యాంగులు ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్లు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఈ తరహా పింఛన్లు పొందుతున్న మొత్తం 8,18,900 మంది అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆరేడు నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ పరిశీలనకు రాలేదని వేలాదిమందికి ఈ నెలలో పింఛను ఇవ్వవద్దని అధికారులను ఆదేశించింది. ఎంతమందికి పింఛన్లు ఆపేశారన్నది అధికారికంగా చెప్పకపోయినా ఈ సంఖ్య 50 వేలకు పైనే ఉంటుందని అనధికారిక సమాచారం.
1.09 లక్షల పింఛన్లు మంజూరు చేస్తే.. ఆ మేరకు సంఖ్య పెరగలేదే?
ఈ నెల ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,09,155 మందికి కొత్తగా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ నెలకు ప్రభుత్వం విడుదల చేసినట్టు ప్రకటించిన మొత్తం పింఛన్ల సంఖ్యలో మాత్రం ఆ మేరకు పెరుగుదల కనిపించలేదు.
జూలై నెలలో జరిగిన పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం 62.81 లక్షల మందికి డబ్బులు విడుదల చేయగా 61.24 లక్షల మందికే పంపిణీ చేశారు. గత నెలలో ప్రభుత్వం విడుదల చేసిన 62.81 లక్షల పింఛన్లకు ఇప్పుడు కొత్తగా మంజూరు చేసినట్టు ప్రకటించిన 1.09 లక్షల పింఛన్లను కూడ కలిపితే ఈ నెలలో 63.90 లక్షల మందికి డబ్బులు విడుదల కావాలి. కానీ.. ప్రభుత్వం 63.71 లక్షల మందికి మాత్రమే డబ్బులు విడుదల చేసింది.
పింఛన్ల సొమ్ము రూ.15.59 లక్షలు స్వాహా
నలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఒక పంచాయతీ కార్యదర్శి చేతివాటం
ప్రత్తిపాడు: లబ్దిదారులకు ప్రతి నెలా పంపిణీ కాకుండా మిగిలిన పింఛన్ల సొమ్మును నలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఒక పంచాయతీ కార్యదర్శి కాజేశారు. రూ.15,59,750 మెక్కేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఈ బాగోతం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన బదిలీల సందర్భంగా ఉద్యోగుల బకాయిలు పరిశీలిస్తున్న క్రమంలో ఈ వ్యవహారం బయట పడింది. మండలంలోని గోకవరం, చినశంకర్లపూడి, గజ్జనపూడి, ధర్మవరం గ్రామ సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఒమ్మంగి పంచాయతీ కార్యదర్శి ఈ అవినీతికి పాల్పడ్డారు.
గ్రామాల్లో పింఛన్లు బట్వాడా చేయగా మిగిలిన సొమ్మును ఏ నెలకు ఆ నెల డీఆర్‌డీఏ (డి్రస్టిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ)కు జమ చేయాలి. జమ చేశారో లేదో ఆయా గ్రామాల కార్యదర్శులు పర్యవేక్షించాలి. కానీ ఇప్పటి వరకూ కార్యదర్శులు దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. డీఆర్‌డీఏలో పింఛన్ల విభాగానికి చెందిన సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) అధికారుల నిర్లిప్తత, ఆడిట్ అధికారులు పట్టించుకోకపోవడాన్ని అవకాశంగా తీసుకుని చినశంకర్లపూడి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గొంప శివాజీ (ప్రస్తుతం ఏలేశ్వరం మండలం భద్రవరం పంచాయతీకి బదిలీ అయ్యారు) అత్యధికంగా రూ.7,46,250 స్వాహా చేశారు.
గోకవరం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈపీ వెంకటేశ్ (ఈయన ఏలేశ్వరం మండలం పేరవరం పంచాయతీకి బదిలీ అయ్యారు) రూ.2,03,250, ధర్మవరం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎం.విజయ్ కుమార్ రూ.1,90,250, గజ్జనపూడి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ముదర సూరిబాబు (ఇదే మండలం చినశంకర్లపూడి పంచాయతీకి బదిలీ అయ్యారు) రూ.45 వేలు, ఒమ్మంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి దడాల నాగ మహేశ్ రూ.3.75 లక్షలు మెక్కేశారు. అందరూ కలిపి మొత్తం రూ.15,59,750 స్వాహా చేశారు. వీరికి నోటీసులు జారీ చేశామని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఎంవీఆర్ కుమార్‌బాబు చెప్పారు.