ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతుంటాయ్‌ | Pawan Kalyan on Visakhapatnam Steel Plant accident | Sakshi
Sakshi News home page

ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతుంటాయ్‌

Jun 10 2026 4:10 AM | Updated on Jun 10 2026 4:10 AM

Pawan Kalyan on Visakhapatnam Steel Plant accident

నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు.. నేనేమి చేయగలను

లోటుపాట్లను అర్థం చేసుకోవడం నాలాంటి వాళ్ల వల్ల కాదు

ప్రమాదాలపై అవసరమైతే ఒకరోజు తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా... డిప్యూటీ సీఎం పవన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌లో నిపుణులను తొలగించడం, సిబ్బందిని తగ్గించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. ‘‘నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. నేనేమి చేయగలను. లోటుపాట్లను అర్థం చేసుకోవడం నాలాంటి వాళ్ల వల్ల కాదు. ప్లాంట్‌ నిర్వహణ లోపాలపై విచారణ కమిటీ వచ్చాకే చెప్పగలను..’ అని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఒక్కోసారి యాక్సిడెంట్స్‌ జరుగుతుంటాయన్నారు. 

స్టీల్‌ ప్లాంటు ప్రమాదంలో గాయపడి కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. ఇటువంటి సందర్భాల్లో అందరూ ఒకేసారి మీద పడిపోతే పరిష్కారం కాదన్నారు. యాజమాన్యాలు ఒకటికి పది సార్లు చూసుకోవాలని... ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఈ ప్రమాదాలపై నాలుగైదు గంటలు... అవసరమైతే ఒకరోజు తీసుకుని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానన్నారు. గతంలో తాను క్యాప్టివ్‌ మైన్స్‌ గురించి మాట్లాడేందుకు ఢిల్లీకి తీసుకెళతానంటే కార్మిక సంఘాల నేతలు ఒక్కరు కూడా రాలేదని వ్యాఖ్యానించారు.  

Advertisement
 
Advertisement
Advertisement