‘ఈ–హెల్త్‌ రికార్డ్‌’తో వైద్యం మరింత సులభతరం

Patient Health Information In E-Health Records As Part Of ABDM - Sakshi

ఆరోగ్య సమాచారం ఈ–రికార్డుల్లో నిక్షిప్తం 

ఉమ్మడి జిల్లాలో 80వేల మందికి పైగా ఈ–హెల్త్‌ రికార్డులు 

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కొనసాగుతున్న గుర్తింపు ప్రక్రియ 

పదే పదే వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఇకపై ఉండదు 

రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా సవివరంగా ఆరోగ్య వివరాలు లభ్యం

రోగి వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు ఇదివరకు తీసుకున్న చికిత్స.. వైద్య పరీక్షల నివేదికలు తప్పనిసరి. దీని ఆధారంగా చికిత్స ఏది అవసరమో అది కొనసాగించవచ్చు. ఇలాంటివి రోగి మరచిపోయినప్పుడు వైద్యులు మొదటి నుంచి పరీక్షలు, స్కానింగ్‌ చేయించి వివరాలు తెలుసుకుని తర్వాత చికిత్స ప్రారంభించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌  (ఏబీడీఎం)లో భాగంగా అలాంటి కాగితాలు ఏవీ లేకుండానే ‘రోగి చరిత్ర’ మొత్తం ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డ్‌ (ఈ–హెల్త్‌ రికార్డ్‌)లో నిక్షిప్తం చేసే విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రోగులు రాష్ట్రంలో ఎక్కడ వైద్యానికి వెళ్లినా తమ పూర్వపు ఆరోగ్య స్థితులను ఇట్టే తెలియజెప్పే ఎల్రక్టానిక్‌ హెల్త్‌ రికార్డుల (ఈ–హెచ్‌ఆర్‌) రిజిస్ట్రేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. రోగులు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చినప్పుడు వారికి వైద్యపరీక్షలు నిర్వహించడం, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి జబ్బులు ఇలాంటివేవైనా ఉంటే పూర్తిస్థాయిలో వివరాలన్నీ ఎల్రక్టానిక్‌ రికార్డుల్లోకి ఎక్కిస్తారు. రోగి ఆధార్, మొబైల్‌ నంబర్లను క్రోడీకరించి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఈ నంబర్‌ ఆధారంగా పూర్వపు ఆరోగ్య వివరాలన్నీ ఏ డాక్టరు వద్దకు వెళ్లినా తెలుసుకోవచ్చు.  

అనంతలో 43 వేలు, శ్రీసత్యసాయిలో 35 వేలు.. 
రాష్ట్రంలో 542 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. అందులో శ్రీసత్యసాయి జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 26 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల వాసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుండగా, పట్టణ పేదలు అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలకు వస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో శ్రీసత్యసాయి జిల్లాలో 35,052 మందికి, అనంతపురం జిల్లాలో 43,578 మందికి ఈహెచ్‌ఆర్‌ నమోదు పూర్తి చేశారు. ఇప్పటికీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది.

ఎలక్ట్రానిక్‌ హెల్త్‌రికార్డులతో.. 
ఎల్రక్టానిక్‌ హెల్త్‌ రికార్డుల వల్ల వైద్యం మరింత సులభమవుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన డేటా మొత్తం ఇందులో ఉండటంతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ ఆస్పత్రికెళ్లినా పూర్తి వివరాలు ఉంటాయి. కొత్తగా ఎప్పుడు వైద్యం చేయించుకున్నా అదనపు వివరాలు నమోదు చేస్తారు. దీనివల్ల జీవనశైలి జబ్బులు ఎంతమందికి ఉన్నాయి, దీర్ఘకాలిక జబ్బులు ఎంతమందికి ఉన్నాయి ఇలా జిల్లాలో ఉన్న మొత్తం వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీన్నిబట్టి జబ్బుల శైలిని కూడా అంచనా వేయొచ్చు. ఈహెచ్‌ఆర్‌లో ఆరోగ్యశ్రీ నెంబర్‌ కూడా నమోదు చేయడం వల్ల ఎక్కడికెళ్లినా ఉచితంగానే వైద్యం పొందే అవకాశం ఉంటుంది. రోగులతో పాటు వైద్యుల వివరాలు ఏబీడీఎంలో నమోదు చేస్తారు. ఏ డాక్టరు ఏ వైద్యం చేశారన్నది కూడా ఇకపై హెల్త్‌ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంటుంది.

ఇదీ చదవండి: సర్కారీ వైద్యం సూపర్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top