6,18,131 మంది విద్యార్థుల్లో 5,26,954 మంది పాస్
వీరిలో బాలికలు 87.90 శాతం, బాలురు 82.68 శాతం
2,161 స్కూళ్లల్లో 100%, 16 పాఠశాలల్లో సున్నా ఫలితాలు
టాప్‌లో పార్వతీపురం మన్యం, అట్టడుగున ఏఎస్సార్ జిల్లా
మే 25 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: గతనెలలో జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫలితాలు గతేడాది కంటే కాస్త మెరుగుపడ్డాయి. ఉత్తీర్ణత గతేడాది కంటే 4.11 శాతం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉత్తీర్ణత 2024లో వచ్చిన 86.69 శాతాన్ని దాటలేకపోయింది. పదోతరగతి పరీక్ష ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. 2025–26 విద్యా సంవత్సరంలో 6,18,131 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 5,26,954 మంది (85.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికలు 2,67,321 మంది (87.90 శాతం), బాలురు 2,59,633 మంది (82.68 శాతం) ఉన్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో 5,83,645 మంది హాజరవగా, 5,03,539 మంది పాసయ్యారు. తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన 30,129 మందిలో 19,834 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ రెండు మాధ్యమాలతో పాటు హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా భాషల్లోను స్వల్పసంఖ్యలో పరీక్షలు రాశారు. ఈ ఏడాది పరీక్షల్లో పాసైన వారిలో అత్యధికంగా 83.69 శాతం మంది ప్రథమ శ్రేణి సాధించారు. 11.87 శాతం మంది ద్వితీయ శ్రేణి సాధించగా 4.44 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాసయ్యారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07 శాతం ఉత్తీర్ణత
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదోతరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో టాప్‌లో నిలిచింది. ఈ జిల్లా టాప్‌లో నిలవడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 96.07 శాతం ఉత్తీర్ణతతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండోస్థానంలోను, 91.08 శాతం ఉత్తీర్ణతతో విజయనగరం జిల్లా మూడోస్థానంలోను నిలిచాయి.
మూడోస్థానంలో ప్రైవేటు స్కూళ్లు
ఈ ఏడాది మొత్తం 12,089 ఉన్నత పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 5,044 ప్రైవేటు పాఠశాలలుండగా మిగిలినవి వివిధ యాజమాన్యాల్లోని ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మొత్తం 2,161 స్కూళ్లు 100 శాతం ఫలితాలను సాధించాయి. మరో 16 పాఠశాలలు ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి. సున్నా ఫలితాలు వచ్చిన 16 పాఠశాలల్లో 11 ప్రైవేటు స్కూళ్లున్నాయి. రాష్ట్రంలోని 12 యాజమాన్య పాఠశాలల్లో.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 96.04 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచాయి. తర్వాత బీసీ సంక్షేమశాఖ స్కూళ్లు 96.02 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో నిలిచాయి. విద్యార్థుల సంఖ్య పరంగా రెండోస్థానంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఉత్తీర్ణతలో 95.29 శాతంతో మూడోస్థానంలో ఉన్నాయి.
నేటి నుంచి రీ కౌంటింగ్ దరఖాస్తులకు అవకాశం
పదోతరగతి పరీక్ష తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశమిచ్చింది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో వారి స్కూల్ లాగిన్ ద్వారా శుక్రవారం నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1000 ఫీజు చెల్లించాలి.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు మే 9
పదోతరగతి తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు త్వరలో టైమ్‌టేబుల్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. విద్యార్థులు శుక్రవారం నుంచి మే 9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో మే 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడుకు పైగా సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలి.
వెనుకబడ్డ కీలక జిల్లాలు
రాష్ట్రంలో ఆది నుంచి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు విద్యాకేంద్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో ఆ జిల్లాల మెరుపులు కనిపించలేదు. గుంటూరు జిల్లా 8వ స్థానంలో నిలవగా కృష్ణాజిల్లా 10, ఎన్టీఆర్ జిల్లా 11 స్థానాల్లో నిలిచి ప్రగతిపరంగా ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడ్డాయి. ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా 24వ స్థానానికే పరిమితమైంది.


