మళ్లీ టెండర్లు.. మళ్లీ కమీషన్లు | Only two companies submitted bids in two tenders | Sakshi
Sakshi News home page

మళ్లీ టెండర్లు.. మళ్లీ కమీషన్లు

Apr 5 2025 5:06 AM | Updated on Apr 5 2025 5:06 AM

Only two companies submitted bids in two tenders

శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణంలో సర్కారు పెద్దల స్కెచ్‌ 

ముందే నిర్ణయించిన సంస్థలకే టెండర్లు దక్కేలా వ్యూహం

రెండు టెండర్లలో రెండే సంస్థలు బిడ్‌ల దాఖలు 

హైకోర్టు భవనాల కాంట్రాక్టు విలువ రూ.924.64 కోట్లు 

అసెంబ్లీ భవనాల కాంట్రాక్టు విలువ రూ.724.69 కోట్లు 

అధిక ధరలకు కోట్‌.. ఖజానాపై రూ.వందల కోట్ల భారం 

తద్వారా భారీగా కమీషన్లు దండుకునేలా ఎత్తుగడ 

ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టుల కోసం రూ.వందల కోట్లు వృథా 

అప్పుగా తెచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు 

అప్పు చేసి ఇల్లు కట్టుకోవాలంటే మీరైతే ఏం చేస్తారు? నలుగురితో మాట్లాడి ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ఒకేసారి ఇల్లు కట్టిస్తారా? లేక తొలుత తాత్కాలికంగా ఒక ఇల్లు కట్టించి.. ఆ తర్వాత శాశ్వతంగా మరో ఇల్లు కట్టిస్తారా? ఎవరైనా అన్నీ సరిచూసుకుని ఒకేసారి ఇల్లు కట్టిస్తారు. ఘనత వహించిన మన సీఎం చంద్రబాబు మాత్రం రెండు సార్లు కడతానంటున్నారు. తొలుత రూ.353 కోట్లు అప్పు చేసి తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ భవనాలను నిర్మించారు. 

ఇప్పుడు మళ్లీ అప్పు చేసి శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ నిర్మిస్తున్నారు. ఇందుకుగాను ఏకంగా రూ.1,649.33 కోట్లు వ్యయం చేయడానికి సిద్ధమై పోయారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కుండానే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ఈ పెద్దమనిషి నిర్వాకమిది. రేపు ఇదే అమరావతిలో ఆయన సొంతంగా నిర్మించుకునే ఇంటిని కూడా ఇలా రెండు మార్లు కడతారా.. అని మాత్రం అడగొద్దు! 

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా సర్కారు పెద్దలు అడుగులు ముందుకు వేస్తున్నారు. 2016–18 మధ్య అప్పుగా తెచ్చిన రూ.353 కోట్లతో తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించి కమీషన్లు దండుకున్న ఇదే చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి తెస్తున్న అప్పులో రూ.1,649.33 కోట్లతో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి పూనుకుంది. 

ఇలా నిధులు దుబారా చేస్తూ.. నచ్చిన సంస్థలకు ఏకపక్షంగా టెండర్లను కట్టబెడుతూ మళ్లీ కమీషన్లు కొట్టేయడానికి పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా ముందే రూపొందించిన స్కెచ్‌ మేరకు రెండు టెండర్లలో తనకు నచ్చిన రెండు సంస్థలే పాల్గొని అధిక ధరలకు బిడ్‌లు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. ఆపై ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టి అనుకున్న మేరకు నిధులు దోచుకోవడానికి రూట్‌ క్లియర్‌ చేసుకున్నారు. 

ఈ క్రమంలో హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు వేర్వేరుగా పిలిచిన టెండర్లలో ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలు రెండే బిడ్లు దాఖలు చేశాయి. హైకోర్టు భవన నిర్మాణ పనులను రూ.924.64 కోట్లతో ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. అసెంబ్లీ భవన నిర్మాణ పనులను రూ.724.69 కోట్లతో ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేజిక్కించుకుంది. తద్వారా హైకోర్టు, అసెంబ్లీ భవనాల కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు రెండు సంస్థలు కోట్‌ చేయడంతో ప్రభుత్వ ఖజానాపై రూ.వందల కోట్ల మేర భారం పడింది. 

మొత్తంగా రెండు భవనాల కాంట్రాక్టు విలువ రూ.1,649.33 కోట్లు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అథారిటీ సమావేశంలో ఈ రెండు టెండర్లను ఆమోదించి, కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించనున్నారు. రాజధాని ప్రాంతంలో 2015లో వెలగపూడి వద్ద 45.12 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు చదరపు అడుగుకు రూ.17,183 చొప్పున వెచ్చించారు. ఈ లెక్కన ఇప్పుడు చేపట్టిన శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చు.  

20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు 
» హైకోర్టు శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయం (కాంప్లెక్స్‌)లోని ‘ఎఫ్‌’ బ్లాక్‌లో 42.36 ఎకరాల్లో.. బేస్‌మెంట్, గ్రౌండ్‌ ప్లోర్, ఏడు అంతస్తుల్లో (బీ+జీ+7) 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

» ఫోస్టర్స్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్‌ను రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలనే షరతుతో మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తంగా హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ అంచనా వ్యయం రూ.924.64 కోట్లకు ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. 

చేస్తోంది అప్పు.. ఆపై దుబారా 
ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని రూ.180 కోట్లతో, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని రూ.173 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన రూ.353 కోట్లు వృథా అవుతాయి. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ప్రస్తుతం శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. 

సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు.. పార్లమెంటు కంటే పెద్దగా అసెంబ్లీ భవనాలను నిర్మిస్తుండటం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఇదంతా దుబారా వ్యయమేనని, అప్పుగా తెచ్చిన నిధులను వృథా చేయడమేనని.. ఇలా దుబారా చేయడం సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

11,21,975 చదరపు అడుగుల్లో అసెంబ్లీ  
» అసెంబ్లీ శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ శాశ్వత భవనాల సముదాయం(కాంప్లెక్స్‌)లో ‘ఈ’ బ్లాక్‌లో బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్, 3 అంతస్తులు(బీ+జీ+3)లో 11,21,975 చదరపు అడుగుల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవన డిజైన్‌ను ఫోస్టర్స్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థే రూపొందించింది.  

» ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈనెల 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ పనులను రూ.724.69 కోట్లకు ఎల్‌ అండ్‌ టీ దక్కించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement