‘నున్న’ మామిడి ర్యాంపు మీద..

Nunna Mango Market Yard Exports Andhra Pradesh - Sakshi

నున్న మార్కెట్‌కు మామిడి పండ్ల కళ

రోజూ 300 నుంచి 400 టన్నుల ఎగుమతి 

సీజన్‌ ఆరంభంలో టన్ను గరిష్ట ధర రూ.1.10 లక్షలు 

ప్రస్తుతం టన్ను ధర రూ.55 వేలు 

ఊపందుకుంటున్న కొనుగోళ్లు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆసియాలోనే అతిపెద్దదైన నున్న మామిడి మార్కెట్‌ వ్యాపారులతో కళకళలాడుతోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ.. నున్న మార్కెట్‌ నుంచి మాత్రం మార్చి 20 నుంచి మొదలయ్యాయి. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలో 8.41 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ప్రస్తుతం నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తెలంగాణలోని కల్లూరు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్‌కు మామిడి పండ్లు వెల్లువలా వస్తున్నాయి. రోజుకు 300నుంచి 400 టన్నుల పండ్లు దేశంలోని వివిధ మార్కెట్లకు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇప్పటివరకు నున్న మార్కెట్‌ నుంచి 2 వేల టన్నులకు పైగా కాయలు ఎగుమతి అయినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

దిగుబడి తగ్గినా.. ధరలు ఆశాజనకం 
ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత ఆలస్యంగా వచ్చింది. జనవరిలో కొంత పూత వచ్చినప్పటికీ వైరస్‌ బారిన పడటంతో పిందెకట్టకుండానే రాలిపోయింది. గతంలో ఎకరానికి 4–5 టన్నుల దిగుబడి రాగా.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గిపోయే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఊరట లభిస్తుందంటున్నారు. గత ఏడాది మార్చి నెలాఖరులో బంగినపల్లి టన్ను ధర రూ.30–35వేలు ఉండగా, ఈ ఏడాది రూ.70–80 వేల వరకు ధర పలుకుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం టన్ను మామిడిపండ్ల ధర రూ.55 వేల వరకు పలుకుతోంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రసాలకు మంచి గిరాకీ ఉంది. కాయలు పక్వానికి రావడంతో తోటల్లోనే కాయ రూ.15– రూ.20 వరకు అమ్ముతున్నారు. పెద్ద రసాలు ఒక్కో కాయ రూ.25నుంచి రూ.30 పలుకుతోంది. సరుకు పూర్తి గా మార్కెట్‌లోకి వస్తే కొంత మేర ధరలు అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు భావిస్తున్నారు.

మంచి ధర వస్తోంది
ఈ ఏడాది మామిడి పండ్లు మంచి ధర పలుకుతున్నాయి. గతంలో ధరలు తగ్గిపోతాయేమోననే భయంతో రైతులు తొందరపడి పక్వానికి రాని కాయల్ని కోసేవారు. ఈ ఏడాది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దిగుబడులు తగ్గడంతో సరుకు తక్కువగా ఉంది. అందువల్ల రైతులు కాయలు పక్వానికి వచ్చాకే కోస్తే బరువు పెరుగుతుంది. ధరలు కొంత అటూఇటూ ఉన్నా రైతులకు నష్టం ఉండదు.
– శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ, ది మ్యాంగో గ్రోయర్స్‌ అసోసియేషన్, నున్న 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top