
నేటి నుంచి ఈ నెల 29 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం
ఆలస్య రుసుముతో 30, 31 తేదీల్లో దరఖాస్తుకు వీలు
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య, దంత కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈనెల 29వ తేదీ రాత్రి తొమ్మది గంటలు దరఖాస్తుల సమర్పణకు చివరి గడువుగా నిర్ధారించారు.
https://apuhs&ugadmissions.aptonline.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.2950, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2360 దరఖాస్తు సమయంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ రూ.22,950, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.22,360 చొప్పున ఆలస్య రుసుముతో ఈ నెల 30, 31వ తేదీల్లో దరఖాస్తు చేసుకోడానికి వీలు కల్పించారు. నియమ, నిబంధనలపై సందేహాల నివృత్తి కోసం 8978780501, 7997710168, రుసుము చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలపై 9000780707 నంబర్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు.
https://drntr.uhsap.in వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విశ్వవిద్యాలయం రూపొందిస్తుంది. తుది మెరిట్ జాబితా ప్రకటించాక కన్వీనర్ కోటా అన్ని దశలకు కలిపి ఒకేసారి వెబ్‌ఆప్షన్‌ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం వివిధ దశలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.
సిద్ధార్థలో ఏయూకు 65.62.. ఎస్వీయూకు 34.38
రాష్ట్ర విభజన పూర్తై గతేడాదితోనే పదేళ్లు పూర్తయిన క్రమంలో గతేడాది రాష్ట్ర వైద్య కళాశాల విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలోని సీట్లను ఏయూ, ఎస్వీయూ రీజియన్ల మెరిట్ విద్యార్థులకు కేటాయించారు. ఈ దఫా కళాశాలలోని స్థానిక కోటా సీట్లను ఏయూ రీజియన్ విద్యార్థులకు 65.62 శాతం, ఎస్వీయూ పరిధిలోని విద్యార్థులకు 34.38 శాతం చొప్పున విభజించినట్టు మంగళవారం వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు సీట్ల భర్తీ ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
స్థానిక కోటా ఇలా
» తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ వరుసగా నాలుగేళ్లు ఆయా రీజియన్లలో చదివి ఉండాలి.
» ఒక వేళ స్థానిక విద్యా సంస్థల్లో నాలుగేళ్లు చదవకపోయినా, అర్హత పరీక్షకు హాజరయ్యే ముందు నాలుగేళ్లు ఏ ప్రాంతంలో నివసించారో దాన్నే స్థానికతగా పరిగణిస్తారు.
» రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఏడేళ్లు చదివి ఉండాలి. ఏడేళ్లలో ఎక్కువ కాలం ఎక్కడ చదివి ఉంటే ఆ ప్రాంతమే విద్యార్థి స్థానికత అవుతుంది.
స్థానికేతర సీట్లలో ఇలా
» 15 శాతం అన్ రిజర్వ్‌డ్, స్థానికేతర సీట్లలో ఏయూ విద్యార్థులు ఎస్వీయూలో, ఇక్కడి విద్యార్థులు ఎస్వీయూలోనూ పోటీపడొచ్చు.
» తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పదేళ్లు రాష్ట్రంలో నివసించి ఉండాలి.
» విద్యార్థి కనీసం పదేళ్లు రాష్ట్రంలో నివసించి ఉండాలి. రాష్ట్రం బయట చదువుకున్న కాలాన్ని మినహాయించి తర్వాత పదేళ్లు ఏపీలో నివాసి అయి ఉండాలి.
» ఏపీ, కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్‌లు, ఇతర సంస్థల్లోని ఉద్యోగుల పిల్లలు అర్హులు.
కన్వీనర్ కోటాలో 3,946 సీట్లు
గతేడాది సీట్ మ్యాటిక్స్ ప్రకారం రాష్ట్రంలో 36 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉండగా వీటిల్లో 6,510 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 475 సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతాయి. 4,046 కన్వీనర్ సీట్లు రాష్ట్ర కోటా కింద భర్తీ చేయాల్సి ఉండగా, ఈ విద్యా సంవత్సరం వైజాగ్ గాయత్రిలో అడ్మిషన్‌లపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) నిషేధం విధించింది.
ఈ కళాశాలలో 200 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమాచారం ప్రకారం కన్వీనర్ కోటాలో 100 సీట్లు తగ్గి 3,946 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి ఏవైనా కళాశాలలకు కొత్తగా సీట్లు మంజూరైతే సీట్ల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో విద్యార్థులు అప్‌లోడ్ చేయాల్సిన ధ్రువపత్రాలు
» నీట్ యూజీ– 2025 ర్యాంక్ కార్డ్
» పుట్టిన తేదీ ధ్రువీకరణ (పదో తరగతి మార్కుల మెమో)
» 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
» ఇంటర్మీడియెట్ స్టడీ, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు
» విద్యార్థి తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
» విద్యార్థి సంతకం
» ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (ఇంటర్/10+2)
» కుల ధ్రువీకరణ
» ఆధార్ కార్డు
» దివ్యాంగ విద్యార్థులు యూడీఐడీతో పాటు,సెల్ఫ్ అఫిడవిట్ సమర్పించాలి