అపరాలలోనూ విత్తన మార్పిడి | New seeds step by step | Sakshi
Sakshi News home page

అపరాలలోనూ విత్తన మార్పిడి

Published Mon, Jun 10 2024 5:34 AM | Last Updated on Mon, Jun 10 2024 5:34 AM

New seeds step by step

మినుము, పెసలు, కందులులో కొత్త రకాలు 

శనగలో కొత్త వంగడాలకు ప్రోత్సాహం 

ప్రస్తుత ఖరీఫ్‌ నుంచే విత్తన మార్పిడి 

దశలవారీగా కొత్త వంగడాలు 

సాక్షి, అమరావతి: విత్తన మార్పిడిపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రకాల స్థానంలో కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా సాగయ్యే అపరాలతో పాటు రబీ సీజన్‌లో ఎక్కువగా సాగయ్యే శనగలో కొత్త వంగడాలను ప్రవేశపెట్టాటలని నిర్ణయించింది.  ఖరీఫ్‌లో వరి తర్వాత ఎక్కువగా 5.9 లక్షల ఎకరాల్లో కందులు, 1.5 లక్షల ఎకరాల్లో మినుములు, పెసలుతో పాటు ఇతర అపరాలు సాగువుతుంటాయి.

రబీలో వరి తర్వాత 10.92 లక్షల ఎకరాల్లో శనగ, 7.25 లక్షల ఎకరాల్లో మినుము, 1.75 లక్షల ఎకరాల్లో పెసలు, మరో 1.10 లక్షల ఎకరాల్లో ఇతర అపరాలు సాగవుతుంటాయి. అపరాలు, శనగలలో కొన్ని రకాలు 30 ఏళ్లకు పైబడి సాగులో ఉన్నాయి. ప్రధానంగా ఖరీఫ్‌లో కందులులో ఎల్‌ఆర్‌జీ 52 (2015) వంగడం 1.50 లక్షల ఎకరాలలో సాగవుతుండగా,  ఎల్‌ఆర్‌జీ 41 రకం (2007) 29వేల ఎకరాలు, ఆషా (1992) వంగడం 11వేల ఎకరాల్లో సాగవుతోంది. 

మినుములో పీయూ–31 (2005) రకం 58 వేల ఎకరాల్లో సాగవుతోంది. రబీలో శనగలు అత్యధికంగా 1999లో విడుదలైన జేజీ–11 రకం ఏకంగా 7.25 లక్షల ఎకరాల్లో, కేఏకే–2 (2000) రకం 44 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ రకాలు చీడ పీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుపాన్లు, వర్షాల సమయంలో ముంపునకు గురై రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇటీవల విడుదలైన తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. 

దశలవారీగా విస్తరణ 
డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించనుంది. 2024–25 సీజన్‌లో 10 శాతం, 2025–26 సీజన్‌లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మారి్పడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. ఈ విత్తనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాల్‌ పోస్టర్లు, కరపత్రాలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోలు, వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా వివరిస్తారు. 

మినుములో ప్రత్యామ్నాయ రకాలు 
» పీయూ–31కు బదులుగా ఖరీఫ్‌ సీజన్‌లో ఎల్‌బీజీ 884, టీబీజీ 104, వీబీఎన్‌8, ఎల్‌జీబీ 904, జీబీజీ1, టీబీజీ 129, ఎల్‌బీజీ 787, ఎల్‌బీజీ 752 ప్రవేశపెడతారు. రబీలో ఎల్‌బీజీ 752 మినహా మిగిలిన వంగడాల సాగును ప్రోత్సహిస్తారు. 
»    తరచూ తెగుళ్ల బారిన పడుతున్న ఐపీయూ 2–43 కి ప్రత్యామ్నాయంగా రెండు సీజన్‌లలో ఎల్‌బీజీ 904 రకం 
» ఎల్‌బీజీ 752కు బదులుగా ఖరీఫ్‌లో టీబీజీ 129, రబీలో టీబీజీ 104, వీబీఎన్‌ 8, ఎల్‌బీజీ 904, జీబీజీ1, ఎల్‌బీజీ 787 
» టీ–9కు బదులుగా రెండు సీజన్‌లలో ఎల్‌బీజీ 884 రకాన్ని, టీబీజీ 104కు బదులుగా ఎల్‌బీజీ 904 రకం 

ఏపీ సీడ్స్‌ ద్వారా సర్టిఫైడ్‌ సీడ్‌ ఉత్పత్తి 
బ్రీడర్‌ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉత్పత్తి చేసింది. ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్‌ సీడ్‌ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఈ మూల విత్తనాన్ని ఏపీ సీడ్స్‌ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో నాటి సరి్టఫైడ్‌ సీడ్‌ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్‌ సీడ్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచ్చిన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తారు. 

పెసలులో ప్రత్యామ్నాయ రకాలు: 
»   ఐపీఎం 2–14కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్‌లలో ఎల్‌జీజీ 574, ఎల్‌జీజీ 607,ఎల్‌జీజీ 630 ఎల్‌జీజీ 600 రకాలు. రబీలో వీటితో పాటు అదనంగా విరాట్, శిఖ రకాలు 
»   ఎల్‌జీజీ 407కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్‌లలో ఎల్‌జీజీ 607 రకాలు, ఎల్‌జీజీ 460కు బదులుగా ఐపీఎం 2–14, ఎల్‌జీజీ 630, ఎల్‌జీజీ 607 రకాలు కందులులో ప్రత్యామ్నాయ వంగడాలు ళీ ఎల్‌ఆర్‌జీ 52 స్థానంలో ఖరీఫ్‌లో టీఆర్‌జీ 59 (తిరుపతి కంది), ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33, పీఆర్‌జీ 176 రకాలను, రబీలో ఎల్‌ఆర్‌జీ 105 (కృష్ణ) రకాలను ప్రవేశపెడతారు. 
» ఎల్‌ఆర్‌జీ 41 స్థానంలో ఖరీఫ్‌లో పీఆర్‌జీ 158, టీఆర్‌జీ 59, ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33 (సౌభాగ్య), పీఆర్‌జీ 176, ఎల్‌ఆర్‌జీ 52 రకాలను, రబీలో ఎల్‌ఆర్‌జీ 105 రకాలు 
»   ఐసీపీహెచ్‌ 2740, ఐసీపీఎల్‌ 87119, పీఆర్‌జీ 158 రకాలకు బదులుగా రెండు సీజన్‌లలోనూ ఎల్‌ఆర్‌జీ 105 రకం  
» ఐసీపీహెచ్‌ 87063 కు బదులుగా రెండు సీజన్‌లలోనూ ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33 రకాలను ప్రవేశపెడతారు. 

శనగలో ప్రత్యామ్నాయ రకాలు 
శనగలో కేఏకే 2కు బదులుగా ఎన్‌బీఈజీ 119 రకాన్ని, జేజీ 11కు బదులుగా ఎన్‌బీఈజీ 776 రకాలు,  ఎన్‌ఈజీ 452 (నంద్యాల గ్రామ్‌ 452), ఎన్‌బీఈజీ 810 (నంద్యాల గ్రామ్‌ 810), ఎన్‌బీఈజీ 857 (నంద్యాల గ్రామ్‌) వంటి కొత్త వంగడాల సాగును ప్రోత్సహించనున్నారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement