నంద్యాల జిల్లా కడమలకాల్వ గ్రామంలో దారుణం
బండి ఆత్మకూరు: నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం కడమలకాల్వలో ఆదివారం అర్ధరాత్రి అత్తను అల్లుడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కడమలకాల్వ గ్రామానికి చెందిన సునీల్ అదే గ్రామానికి చెందిన కళావతి(40) కుమార్తె ఎస్తేరును ఐదేళ్ల కిందట ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెయింటింగ్ పనిచేసే సునీల్ మద్యం తాగుతూ తరచూ భార్యతో గొడవపడేవాడు.
ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భయంతో ఎస్తేరు తన తల్లి కళావతి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన సునీల్ కత్తి తీసుకుని అత్తారింటికి వెళ్లి భార్యపై దాడికి యతి్నంచాడు. ఈ సమయంలో అడ్డుగా వచ్చిన అత్త కళావతి గుండె, కడుపు పైభాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


