మృతిచెందిన తల్లీ బిడ్డ
సాక్షి, చౌడేపల్లె: చిత్తూరు జిల్లాలో ఓ తల్లి తొమ్మిది నెలల బిడ్డతో శుక్రవారం తెల్లవారుజామున చెక్‌డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... చౌడేపల్లె మండలంలోని వెంగళపల్లెకు చెందిన పి.నరసింహులు పెద్దకుమార్తె పి.ఆదిలక్ష్మి(37)కి దిగువపల్లె పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన గంగాధర్‌కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆదిలక్ష్మి సోమల మండలం ఆవులపల్లెలో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్–లెవెల్ హెల్త్ ప్రొవైడర్)గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త గంగాధర్ మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ దంపతులకు ఓ కుమార్తె క్రితిక (9నెలలు). ప్రసూతి సెలవులో ఉన్న ఆదిలక్ష్మి పుట్టినిల్లు వెంగళపల్లెలో ఉంటోంది. చిన్నారికి అనారోగ్యంగా ఉండటంతో మదనపల్లె, తిరుపతి, బెంగళూరు, హైదరాబాదు ప్రాంతాల్లో వైద్యం చేయించారు. పాప ఆరోగ్యం కుదుటపడకపోవడం, ఎల్లప్పుడు బిడ్డ గురించే ఆలోచిçస్తూ ఆదిలక్ష్మి తరచూ బాధపడుతూ ఆందోళన చెందేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆరునెలల మెటరి్నటీ సెలవు ముగుస్తుండగా అధికారులకు సమస్యను చెప్పి, మరో రెండు నెలలు అదనపు సెలవు మంజూరు చేయించుకుంది.
ఈనెల 20న విధులకు హాజరు కావాల్సి ఉండగా కుమార్తె ఆరోగ్య పరిస్థితుల కారణంగా విధులకు హాజరుకాలేదు. ఈక్రమంలో ఆదిలక్ష్మి శుక్రవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా, సమీపంలోని కొండామర్రి వెళ్లే వంకకు అడ్డంగా నిరి్మంచిన చెక్‌డ్యాం వద్దకు చేరుకుంది. కుమార్తెను నడుముకు కట్టుకుని నీళ్లలోకి దూకి ఆత్మహత్య చేçసుకుంది. వేకువజామున లేచిన కుటుంబ సభ్యులకు ఆదిలక్ష్మి, ఆమె బిడ్డ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల గాలించగా, చెక్‌డ్యాంలో మృతదేహాలను గుర్తించి, వెలికి తీశారు.


