విశాఖలో మోడరన్‌ ట్రామ్‌ ప్రాజెక్టు | Sakshi
Sakshi News home page

విశాఖలో మోడరన్‌ ట్రామ్‌ ప్రాజెక్టు

Published Thu, Jun 29 2023 4:24 AM

Modern Tram Project in Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ప్రతిపాదించిన మెట్రో లైట్‌ (మోడరన్‌ ట్రామ్‌) ప్రాజెక్టుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారు చేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. మంత్రి బుధవారం మెట్రో ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు డీపీఆర్‌ను మరింత మెరుగ్గా తయారు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ అధునాతన ట్రామ్‌ ప్రాజెక్టును మెట్రో రైలు సిస్టంకు అనుసంధానంగా నగరం నలు దిక్కులా నాలుగు కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 60.05 కిలోమీటర్ల పరిధిలో 58 స్టేషన్లతో రూ.5,332 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి వివరించారు.

ప్రజా అవసరాలు, డిమాండ్‌ తదితర ప్రాధాన్యతలకు అనుగుణంగా ఒక్కొ­క్క కారిడార్‌కు తగిన ఆర్థిక నమూనా (ఫైనాన్షియల్‌ మోడల్‌)లో అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో పురపాలక, ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌లు వై.శ్రీలక్ష్మి  , ఎస్‌ఎస్‌ రావత్, మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ యూజేఎం రావు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement