
సాక్షి, తాడేపల్లి: 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చామన్న సంగతి మాణిక్య వరప్రసాద్ మరోసారి తెలిపారు.
శనివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ..‘పేదలకు అమరావతిలో ఇల్లు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. పేదల పక్షాన పోరాడుతున్నానని జగన్ చెప్తున్నారు.అమరావతిలో కేవలం ఒక వర్గం మాత్రమే ఉండాలని మీ ఉద్దేశమా?, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను సీఎం జగన్ ప్రభుత్వం శిరసావహిస్తోంది.
ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉండాలనేది సీఎం జగన్ ఉద్దేశం. పేదలకోసం పోరాడతామనే వామపక్షాలు, ప్రజాసంఘాలు ఈ జడ్జిమెంట్‌పై కిమ్మనలేదు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ వ్యక్తికి సమానత్వం ఉండాలి. పేదలకు మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకునే సంస్కృతిని టీడీపీ మానుకోవాలి’ అని పేర్కొన్నారు.