నెల్లూరు నాదే.. ఫిక్స్ అయిపోండి! | MLA Kotamreddy Sridhar Reddy Daughter Vaishnavi Political Entry, Sparks Debate Over Kotamreddy Brothers’ Future | Sakshi
Sakshi News home page

నెల్లూరు నాదే.. ఫిక్స్ అయిపోండి!

May 25 2026 8:39 AM | Updated on May 25 2026 10:55 AM

MLA Kotamreddy Sridhar Reddy Daughter Vaishnavi Political Entry

రాజకీయాల్లో పదవీ కాంక్ష ఎంతటి వారలనైనా.. ఎంతటికైనా దిగజార్చుతుంది. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో కోటంరెడ్డి బ్రదర్స్‌ శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి రామలక్ష్మణులుగా కలిసి రాజకీయాలను చేస్తున్నారు. తాజాగా శ్రీధర్‌రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయ అరంగ్రేటం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ఈ దఫా ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని నెల్లూరు రూరల్‌ టికెట్‌ తన రాజకీయ వారసుడిగా సోదరుడిని రంగంలోకి దింపుతానంటూ గతంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గిరిధర్‌రెడ్డి సైతం తానే అభ్యర్థినినంటూ రెండేళ్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తల వద్ద ప్రకటించుకున్నారు. పార్టీ వ్యవహారాలతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలిస్తూ షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న విషయం విదితమే.    

కుమార్తె పొలిటికల్‌ ఎంట్రీతో ప్రకంపనలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి తాను ఇక నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం  నెల్లూరు రూరల్‌ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తనకు నియోజకవర్గంలోని ప్రతి ఊరుతోనూ, ప్రతి నేతతో ముఖ పరిచయాలే ఉన్నాయంటూనే వారి పేర్లను గుక్క తిప్పకుండా చెప్పుకుంటూ వచ్చారు. పరిస్థితులను బట్టి తన తండ్రి, అధిష్టానం ఆదేశిస్తే తాను నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించడంతో ఒక్కసారిగా రూరల్‌లోని నాయకులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు.

 వైష్ణవి విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కార్యాలయంలోనే ఉండడం, గిరిధర్‌రెడ్డి లేకపోవడంతో పార్టీ క్యాడర్‌లో కూడా చర్చకు దారితీసింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో డీలిమిటేషన్, మహిళా బిల్లులు నిలిచిపోగా, 2029 నాటికి అయినా మహిళా బిల్లు అమల్లోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై పార్టీలో వివిధ కోణాల్లో చర్చ జరుగుతోంది. మరో మూడేళ్లు ఎన్నికలకు సమయం ఉండగా ఆమె ఈ సమయంలో పొలిటికల్‌ ఎంట్రీలోనే తాను పోటీలో ఉన్నట్లు చెప్పడం నెల్లూరు టీడీపీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.  

కుటుంబంలో విబేధాల కారణంగానే..  
కోటంరెడ్డి సోదరుల మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి నుంచి సోదరుడికి టికెట్‌ వెళ్లడాన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే ఎమ్మెల్యే తన కుమార్తెతో ఎంట్రీ ఇచ్చారని సమాచారం. ఇదే సమయంలో తనను రాజకీయంగా వెన్నుపోటు పొడిచారనే బాధతో గిరిధర్‌రెడ్డి తన వర్గం వద్ద వాపోయినట్లు సమాచారం. గిరిధర్‌రెడ్డి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ఉవాచ.

గిరిధర్‌రెడ్డి పరిస్థితి ఏంటి? 
సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ స్టూడెంట్‌ లీడర్‌ స్థాయి నుంచి నెల్లూరు రూరల్‌లో రాజకీయంగా ఎదిగి మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి సైతం అన్న బాటలోనే నడిచారు. ఎమ్మెల్యేకు ఇటీవల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వచ్చే దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. ఆయన స్థానంలో సోదరుడు గిరిధర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీలోని క్యాడర్‌ మొత్తం అనుకున్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా, పాలనా పరంగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గిరిధర్‌రెడ్డి సైతం షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. 

అధికారుల సమావేశాల్లో కూడా కొలువు తీరేవారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఎమ్మెల్యేగా భావించి రెడ్‌కార్పెట్‌ పరిచిన సందర్భాలు ఉన్నాయి. అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో శ్రీధర్‌రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి పొలిటికల్‌ ఎంట్రీ ప్రకటన చేయడంతో రాజకీయంగా కలకలం రేపింది. రామలక్ష్మణుల్లా మసులుకునే అన్నదమ్ముల మధ్య విభేదాలు, అంతరాలు పెరిగాయా? లేదా తండ్రి రాజకీయ వారసత్వ రాజకీయాల్లోకి తనకు అవకాశం కల్పించాలని కుమార్తె నుంచి ఒత్తిడి పెరిగిందా? ఇలా.. అనేక రకాలుగా చర్చలు జరుగుతుండగా, అనేకనేక ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోదరుల మధ్య విభేదాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.   

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement