జలం.. పుష్కలం

Ministry Of Finance Water Grid Scheme Implementation In 4 Constituencies In Annamayya District - Sakshi

అన్నమయ్య జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలోవాటర్‌గ్రిడ్‌ పథకం అమలుకు ఆర్థికశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ 

అన్నమయ్య జిల్లాకు రూ.2,150 కోట్లు, చిత్తూరులో రూ.250 కోట్ల వ్యయం 

తీరనున్న తాగునీటి కష్టాలు 

బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో ప్రజలకు శాశ్వత తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేసింది. తద్వారా వచ్చే 30 ఏళ్ల వరకు(2054) నీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించే వాటర్‌ గ్రిడ్‌ పథకానికి ప్రభుత్వం రూ.2,400 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపర ఉత్తర్వులను ఫిబ్రవరిలోనే జారీ చేసింది. దీంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సమగ్ర నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. ఐదు నియోజకవర్గాల్లోని 4,938 పల్లెలు, రెండు మున్సిపాలిటీలకు తాగునీరు అందుతుంది.   

నిధుల వినియోగం ఇలా  
రూ.2,400 కోట్ల వ్యయంతో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, ఈ రెండు జిల్లాల్లోని మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు అమలు చేస్తారు. ఈ పనులకు సంబంధించి  రూ.1,550 కోట్లతో పాలనాపరమైన అనుమతి ఇచ్చింది.

మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో రూ.850 కోట్ల పనులకు పాలనాపర అనుమతి రావాల్సి ఉంది. రూ.1,550 కోట్లలో కేంద్రం జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.755 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.755 కోట్లు ఖర్చు చేయనుంది.్ల గండికోట రిజర్వాయర్‌ నుంచి 3.37 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఇంటింటికి శుద్ధిచేసిన జలాన్ని కుళాయిల ద్వారా అందిస్తారు.  

పైప్‌లైన్‌ ఇలా: మామిళ్లవారిపల్లె రీట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి ఎడమవైపు పైప్‌లైన్‌ ద్వారా గుర్రంకొండ, వాయల్పాడు, కలికిరి, కలకడ, కేవీపల్లె, పీలేరు, సదుం, రొంపిచర్ల, పులిచర్ల మండలాలకు,కుడివైపు పైప్‌లైన్‌ ద్వారా  పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కురబలకోట మీదుగా మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, పుంగనూరు, చౌడేపల్లె, సోమల వరకు సాగుతుంది.  

165 కిలోమీటర్ల పైప్‌లైన్‌  
వైఎస్సార్‌ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నుంచి జిల్లాలోని గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు కృష్ణా జలాలను తరలించేందుకు 165 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మిస్తారు. నీటి తరలింపు కోసం గండి, కొండప్పగారిపల్లె, గాలివీడు, కార్లకుండ, గాలివీడు, కలిచర్ల వద్ద 25వేల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన సంపులు నిర్మిస్తారు.  

రూ.850 కోట్లకు అనుమతి రావాలి 
మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో వాటర్‌గ్రిడ్‌ అమలు కోసం రూ.850 కోట్లకు ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతి రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతానికి మంజూరైన ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పనుల అమలు ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించాం.     –ఎండీ.అబ్దుల్‌ మతీన్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ, మదనపల్లె   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top