Merugu Nagarjuna: చంద్రబాబు గ్యాంగ్‌వి దొంగ డ్రామాలు: మంత్రి మేరుగ నాగార్జున

Minister Merugu Nagarjuna Special Comments On CM Jagan - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నేను సైతం భాగస్వామినవుతా. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా. వైఎస్సార్‌ సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోంది. తాజా మంత్రివర్గ కూర్పుతో సామాజిక మహా విప్లవానికి సీఎం వైఎస్‌ జగన్‌ నాంది పలికారు. కీలకమైన ఉప ముఖ్యమంత్రి నుంచి, హోం,  రవాణా, సాంఘిక సంక్షేమ, పురపాలక, ఎక్సైజ్‌ వంటి శాఖలను బహుజనులకు కట్టబెట్టారు. ఇతర రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రైనా  ఇంత సామాజిక న్యాయంతో పాలన సాగించారా? బహుజనులకు ఇంతటి ప్రాధాన్యమిచ్చారా? దటీజ్‌ జగన్‌మోహన్‌రెడ్డి.’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ‘సాక్షి’తో మంగళవారం ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

వైఎస్సార్‌తో విద్యార్థి దశ నుంచీ పరిచయం.
నాకు సామాజికంగా, రాజకీయంగా ఏ బ్యాక్‌ గ్రౌండ్‌ లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డితో విద్యార్థి దశ నుంచే పరిచయం. అందుకే ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్న నన్ను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించారాయన. ఆ తర్వాత 2009లో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ సీటును పనబాక లక్ష్మికి కేటాయించి నాకు వేమూరు అసెంబ్లీ సీటు ఇచ్చారు. వైఎస్సార్‌పై నమ్మకంతో నా కుటుంబంతో సంప్రదించకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ ఎన్ని కల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడా. వైఎస్సార్‌ మరణానంతరం నా భవిష్యత్‌ అగమ్యగోచరమైంది. 

ఒత్తిళ్లు వచ్చినా వైఎస్‌ జగన్‌ వెంటే.. 
కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగాలని భారీగా ఒత్తిళ్లు వచ్చాయి. అయినా నేను జగన్‌మోహన్‌రెడ్డితోనే నడవాలని నిర్ణయించుకున్నా. పార్టీలోకి వచ్చిన వెంటనే నన్ను పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షునిగా చేశారు. 2014లో సీటు ఇచ్చారు. ఓడిపోయాను. అయినా పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షునిగా నన్ను కొనసాగించారు. 2019లో మళ్లీ సీటు ఇచ్చి గెలిపించారు. రెండుసార్లు ఓడిపోయిన ఎస్సీ వ్యక్తికి మళ్లీ సీటు ఇచ్చి గెలిపించడం ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యం. ఇప్పుడు ఏకంగా మంత్రిని చేశారు. ఏమిచ్చినా ఆ కుటుంబం రుణం తీర్చుకోలేను.   

అందరినీ కలుపుకుని ముందుకెళ్తా..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నదే నా ఆకాంక్ష. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఎస్సీ సామాజిక వర్గం అభివృద్ధికి పాటుపడతా. ఎస్సీలలోని అన్ని ఉపకులాలనూ కలుపుకుని ముందుకెళ్తా. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారతదేశ రాజకీయాల్లో చిరకాలం కొనసాగాలని, ఆయన కింద నేను పనిచేయాలని కోరుకుంటున్నా. నాకు ఓటు వేసిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా.   

సంక్షేమ రేడు సారథ్యమే మహాభాగ్యం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినవ అంబేడ్కర్‌. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన సాగుతోంది. గతంలో చంద్రబాబునాయుడిని అంబేడ్కర్‌ విగ్రహం పెట్టాలని కోరితే ఎక్కడో తుప్పల్లో ఒక మూలన పెట్టే యత్నం చేశారు. దాన్నీ పూర్తి చేయలేదు. అదే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేం అడగకుండానే విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం పెడుతున్నారంటే ఆయనకు అంబేడ్కరిజంపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. సీఎం రాష్ట్రంలో సంక్షేమ విప్లవం సృష్టించారు. దీనిలో నేను సైతం భాగస్వామినవుతా. ఆ వరాల రేడు సారథ్యంలో పనిచేయడమే మహాభాగ్యం. జన సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తా. 

చంద్రబాబు గ్యాంగ్‌వి దొంగ డ్రామాలు    

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. విద్య, వైద్యం, ప్రాథమిక రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఈ విజన్‌తో చంద్రబాబునాయుడు ఎప్పుడైనా ఆలోచన చేశారా? పేదలకు సంక్షేమ ఫలాలు అందుతుంటే కోర్టుల ద్వారా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఇది న్యాయమా? గతంలో దళితుల స్వాధీనంలో ఉన్న అసైన్డ్‌ భూములు లాగేసుకుని వాటినే రాజధాని కోసమంటూ ప్రభుత్వానికి ఇచ్చి తెలుగుదేశం పార్టీ నేతలు దోచుకున్నారు. ఇప్పుడు ఆ పచ్చదండు దొంగ డ్రామాలు ఆడుతోంది. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. వారికి సరైన సమయంలో బుద్ధిచెబుతారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top