ఎమ్మెల్యే బూచేపల్లిపై రెడ్‌బుక్‌ కుట్రలు | Mines Officials Conduct Surprise Raids on Granite Quarries Owned by Buchepalli Sivaprasad Reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే బూచేపల్లిపై రెడ్‌బుక్‌ కుట్రలు

May 12 2026 4:57 AM | Updated on May 12 2026 4:57 AM

Mines Officials Conduct Surprise Raids on Granite Quarries Owned by Buchepalli Sivaprasad Reddy

బూచేపల్లి శివప్రసాదరెడ్డికి చెందిన సూర్య గ్రానైట్స్‌లో తనిఖీలు చేస్తున్న మైన్స్‌ అధికారులు

సూర్య గ్రానైట్స్‌లో మైన్స్‌ అధికారుల ఆకస్మిక సర్వే   

సాక్షి టాస్క్ ఫోర్స్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బందులు పెట్టేలా చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి చెందిన గ్రానైట్‌ క్వారీలపై మైన్స్‌ అధికారులతో ఆకస్మిక దాడులకు పూనుకుంది. సోమవారం మైన్స్‌ డీడీ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో అధికారులు రెండు బృందాలుగా చీమకుర్తి మండలం రామతీర్థం పరిధిలో ఉన్న సూర్య గ్రానైట్స్‌ క్వారీల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైటెక్‌ సర్వే కెమెరాలను తీసుకొచ్చి క్వారీల్లోని నలుమూలల కొలతలు సేకరించారు.

అమ్మకాలు ఎంత? ఉత్పత్తి ఎంత? అంటూ అక్కడి కార్యాలయంలోని రికార్డుల్లో వివరాలను మైన్స్‌ అధికారులు సేకరించారు. రామతీర్థం కేంద్రంగా వైఎస్సార్‌సీపీతో పాటు టీడీపీకి చెందిన వారికి, ఆ పార్టీ సానుభూతిపరులుగా ఉన్న పలువురికి గ్రానైట్‌ క్వారీలున్నాయి. చీమకుర్తి పరిసరాల్లో ఉన్న వందలాది క్వారీల వైపు ఏనాడూ తొంగి చూడని మైన్స్‌ అధికారులు కేవలం బూచేపల్లికి చెందిన సూర్య గ్రానైట్స్‌పై మాత్రమే దాడులు నిర్వహించటం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 2014–19లో కూడా అప్పటి అధికార టీడీపీకి అనుకూలంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డిని మలచుకునేందుకు ఎన్నో ఒత్తిళ్లు చేశారు. సూర్య గ్రానైట్‌ క్వారీని రెండేళ్లు మూసేసి ఆర్థికంగా దెబ్బతీశారు.

Advertisement
 
Advertisement
Advertisement