ఎస్సీ విద్యార్థులకు జేఈఈ, నీట్‌లలో ఉచిత శిక్షణ 

Meruga Nagarjuna SC Students JEE NEET Free training - Sakshi

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో కోచింగ్‌ 

రాష్ట్రంలో 8 కేంద్రాల్లో శిక్షణను ప్రారంభించిన మంత్రి నాగార్జున 

సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విద్యార్థులు విజయాలు సాధించడానికి అవసరమైన ప్రతి సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల ఆధ్వర్యంలో ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ జేఈఈ, నీట్‌కు షార్ట్‌ టర్మ్‌ కోచింగ్‌ను వర్చువల్‌ విధానం ద్వారా సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. గతంలో మూడు కేంద్రాల్లోనే శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది నుంచి 8 కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు.

బాలికలకు మధురవాడ (విశాఖ), ఈడ్పుగల్లు (పెనమలూరు), సింగరాయకొండ (ప్రకాశం), చిన్నచౌక్‌ (కడప)లలో ఉచిత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే బాలురకు కొత్తూరు (అనపర్తి), చిల్లకూరు (నెల్లూరు), అడవి తక్కెళ్లపాడు (గుంటూరు), చిన్నటేకూరు (కర్నూలు)ల్లో ఇస్తున్నామని తెలిపారు. వీటిలో ఎస్సీ విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో శిక్షణ ఉంటుందన్నారు.

అంబేడ్కర్‌ గురుకులాల ఆధ్వర్యంలో ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒకటి చొప్పున పోటీ పరీక్షల కేంద్రాలను ప్రారంభించడానికి కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా కేంద్రాల్లోని కొందరు విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడారు. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి పావనమూర్తి పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top