Ukraine War: Medico Akhila Who Returned Home Safely From Ukraine - Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: నరకం నుంచి బయటకొచ్చా: యర్రా అఖిల

Mar 3 2022 2:53 PM | Updated on Mar 3 2022 4:00 PM

Medico Akhila Who Returned Home Safely From Ukraine - Sakshi

సాక్షి, వేటపాలెం (ఒంగోలు): ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న దేశాయిపేట పంచాయతీ ఐటీఐ కాలనీకి చెందిన యర్రా అఖిల క్షేమంగా బుధవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకుంది. ఉక్రెయిన్‌ నుంచి బయటపడే క్రమంలో తనతోపాటు తోటి విద్యార్థులు ఎదుర్కొన్న కష్టాలను ‘సాక్షి’తో పంచుకుంది. ‘పశ్చిమ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా సిటీలోని విన్నిట్సియా ఫిరోగోవ్‌ మెడికల్‌ యూనివర్శిటీలో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్‌ చదువుతున్నా. ఉక్రెయిన్‌–రష్యా మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మేమంతా ఇండియాకి చేరుకుంటామో లేదోననే ఆందోళన మొదలైంది. అక్కడ ఉన్న రోజులు గుర్తు చేసుకుంటే భయమేస్తోంది. సైరన్‌ మోగగానే బంకర్‌లోకి పరుగెత్తి దాక్కునేవాళ్లం. స్నేహితులంతా కలిసి ప్రైవేట్‌ బస్‌ మాట్లాడుకుని ఉక్రెయిన్‌ బోర్డర్‌కి చేరుకున్నాం.

అయితే ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారులు రొమేనియా బార్డర్‌కు పది కిలోమీటర్ల ముందే బస్‌లు నిలిపివేశారు. మాపై పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారు. అక్కడ నుంచి పది కిలోమీటర్లు లగేజీ మోసుకుంటూ రొమేనియా చేరుకున్నాం. రొమేనియాలో అధికారులు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అక్కడ నుంచి రొమేనేయా రాజధాని బుకారెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు ప్రత్యేకంగా బస్‌ ఏర్పాటు చేశారు. ఇండియన్‌ ఎంబసీ అధికారులు సిద్ధంగా ఉంచిన విమానంలో నేరుగా ఢిల్లీ చేరుకున్నాం. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విజయవాడ వరకు వచ్చాం. అక్కడ నుంచి ప్రభుత్వం వాహనంలో బుధవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నా. ఆ నరకం నుంచి ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్నాన’ని అఖిల వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేసింది.    

వేటపాలెం : దేశాయిపేటలోని ఇంటికి ప్రభుత్వ వాహనంలో చేరుకున్న యర్రా అఖిల

బుడాపెస్ట్‌కు వెళ్తున్నాం.. 
మద్దిపాడు: ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా యూనివర్సిటీలో వైద్య విద్యనభ్యసిస్తున్న లింగంగుంట గ్రామానికి చెందిన దేవరంపాటి అశోక్, పాటిబండ్ల యశ్వంత్‌ క్షేమంగా ఉన్నట్లు వారి తల్లిదండ్రులు తెలియజేశారు. ఉక్రెయిన్‌ సరిహద్దు వరకు ట్రైన్‌లో వెళ్లి, అక్కడ నుంచి బస్‌లో హంగరీ రాజధాని బుడాపెస్ట్‌కు చేరుకున్నారని వివరించారు. అశోక్‌ కుటుంబం లింగంగుంటలో ఉండగా, యశ్వంత్‌ తల్లిదండ్రులు ఒంగోలులో నివాసం ఉంటున్నారు. బుడాపెస్ట్‌ నుంచి బుధవారం రాత్రి విమానంలో బయలుదేరే అవకాశముందని, గురువారం సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారు. కాగా అశోక్‌ కుటుంబ సభ్యులతో తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ మాట్లాడి భరోసా కల్పించారు.     

రొమేనియా షెల్టర్‌లో ఉన్నా.. 
కురిచేడు: ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న పడమరవీరాయపాలెం విద్యార్థి నాగప్రవీణ్‌ తండ్రి కాశయ్య, కుటుంబ సభ్యులను తహసీల్దార్‌ నాగూర్‌మీరా, వీఆర్వో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి జగన్‌మోహనరెడ్డి బుధవారం పరామర్శించారు. నాగప్రవీణ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వివరించి ధైర్యం చెప్పారు. నాగప్రవీణ్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను రొమేనియాకు చేరుకున్నా. ఇండియన్‌ ఎంబసీ అధికారులు ఏర్పాటు చేసిన షెల్టర్‌లో ఉంటున్నా. ఇక్కడ మొత్తం 70 మంది విద్యార్థులుండగా బుధవారం 30 మందిని భారత్‌కు తరలించారు. మిగిలిన వారిని వెంటనే తరలిస్తామని అధికారులు చెప్పార’ని తహసీల్దార్‌కు వివరించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement