పడకేసిన ఆరోగ్య రంగం! | Medical services have deteriorated in all aspects within a year | Sakshi
Sakshi News home page

పడకేసిన ఆరోగ్య రంగం!

Jul 6 2025 5:58 AM | Updated on Jul 6 2025 5:58 AM

Medical services have deteriorated in all aspects within a year

ఏడాదిలోనే అన్ని రకాలుగా దిగజారిన వైద్య సేవలు

ఆరోగ్యశ్రీ నిర్వీర్యమై పోయింది.. గత ప్రభుత్వం ప్రకటించిన 17 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం సాధ్యం కాదనీ, ‘పీపీపీ’ల ప్రాతిపదికనే వాటిని నిర్వహిస్తామంటూ చేతులెత్తేసింది.. మునుపు మండ­లానికి ఒక్కటి అంటూ కచ్చితంగా తిప్పిన అంబులెన్సుల్లో నేడు చాలా వరకు రిపేర్ల పేరుతో మూలనపెట్టింది.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అటకెక్కించింది.. కనీసం అత్యవసర మందులను సైతం అందుబాటులో ఉంచలేకపోతోంది.. వెరసి పేదోడికి పెద్ద రోగమొస్తే ప్రభుత్వ ఆస్పత్రులను నమ్ముకోవద్దని తన చేతల ద్వారా స్పష్టం చేస్తోంది.

కుయ్‌.. కుయ్‌.. కుయ్‌..  
అలనాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఓ ఎన్నికల సభలో 108 సేవల గురించి ప్రస్తావిస్తూ ఆయన వినిపించిన అంబులెన్స్‌ తాలూకు భరోసా శబ్దాలివి. 

రయ్‌.. రయ్‌.. రయ్‌..  
ఆ తర్వాత తన తండ్రి వాగ్దానాలను పటిష్ట పరుస్తూ వైఎస్‌ జగన్‌ జెండా ఊపినప్పుడు ఒకేసారి పరుగెత్తిన 1024 అంబులెన్సుల హోరులవి. 

నై.. నై.. నై.. 
గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు చక్కగా అందుతుండగా.. వాటిని మరింత మెరుగ్గా కొనసాగించాల్సింది పోయి, అసలు ఈ పథకానికే ఎసరు తెస్తూ.. ప్రభుత్వ వైద్యం నో.. నో.. నో.. అంటూ ప్రైవేట్‌/కార్పొరేట్‌ వైద్యానికి మేలు కలిగేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.  

యాసిన్‌ – గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  కొన్ని కారణాల వల్ల చిలకలూరిపేటలో ఇటీవల ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగాడు. అతణ్ణి అర్జెంటుగా ఆసుపత్రికి తరలించాలి. కానీ ‘లెన్సు’ వేసి చూసినా ‘అంబులెన్సు’ అందుబాటులో లేదు.  గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు మండ­లాలకు ఒక్కొక్కటి చొప్పున చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు ఆంబులెన్సులు అందుబాటులో ఉండేవి. ఇందులో చిలకలూరిపేటలోని అంబులెన్సు కోసం వాకబు చేస్తుండగా ఇక్కడి వాహనం రిపేర్లో ఉందని, అందువల్ల నాదెండ్ల లేదా యడ్లపాడు వాహనం కోసం ప్రయత్నిoచాలంటూ అక్కడి సిబ్బంది చెప్పారు. 

అక్కడి నుంచి సదరు అంబులెన్సు వచ్చేలోపు ప్రాణాలే పోవచ్చనే అభిప్రాయంతో స్థానిక ప్రజలు సొంత డబ్బులతో బాధి­తుడిని ఆసుపత్రికి చేర్చారు.  ‘‘గతంలో 108 అంబులెన్సు కోసం ఫోన్‌ చేస్తే గరిష్టంగా 10 నిమిషాల లోపే వచ్చేసేవి. బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడేవి. ఇప్పు­డు వాటి ఆనూ పానూతో పాటు నడిపించేందుకు తగిన ప్లానూ లేకుండా పోయింది. నిరు­టి వరకు చక్కగా తిరిగిన ప్రాణరక్షణ ఆంబులెన్సులు ఇప్పుడు కూడా అలాగే ఎందుకు పని చేయడం లేదు?’’ అనే ప్రశ్న ఇప్పుడు అక్కడి స్థానికుల నుంచి వినిపించింది. ఈ ప్రశ్నకు జవాబు లేదు. దొరికే దాఖలా కూడా లేదు.   

ఎంతలో ఎంత తేడా? 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరింత బలోపేతం చేసేందుకు పూనుకుంది. దానికి తోడు జగన్‌ ప్రభుత్వం అధికారానికి రావడంతోనే కరోనా వైరస్‌ విజృంభించడం, మరిన్ని వైద్య సేవలూ అవసరం కావడంతో ఈ పథకం పరిధిలోకి వచ్చే వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టి మరీ అప్పట్లో టీడీపీ ప్రభుత్వం  దిగిపోయింది. ఆ పెండింగ్‌ బకాయిలను కూడా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ చెల్లించారు. 

అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి మళ్లీ ఊపిరిలూదారు. అంతకు ముందు తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికే ఆరోగ్య­శ్రీ అనే నిబంధనను సవరించి, రూ.ఐదు లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలను పథకం పరిధిలోకి తెస్తూ 2019 డిసెంబర్‌ 19న ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. రూ.వెయ్యి ఖర్చు దాటే చికిత్సలను పథకం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో 1,059 ప్రొసీజర్‌లను ఐదేళ్లలో 3,257కు పెంచారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. 

హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో కూడా చికిత్స చేయించుకునే అవకాశం కల్పించారు. అయితే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రొసీజర్‌ను అదనంగా పథకం పరిధిలోకి చేర్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సానంతరం రోగులకు అందించే ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలివేసింది. గత ప్రభుత్వంలో చికిత్సానంతరం రోగులకు నెలకు రూ.5 వేల మేర సాయం అందించేవారు. దీనిప్రకారం.. గత ఏడాదికి రూ.400 కోట్ల మేర సాయం అందించాల్సిన సాయాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. 

ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలు అరకొరగా అందుతున్నాయనీ, పైగా హాస్పిటళ్లకు బకాయిలు చెల్లించకపోవడంతో పేరున్న చాలా ఆసుపత్రుల్లో ఈ పథకం కింద రోగులను తీసుకోడానికి సుముఖంగా లేవంటూ ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ‘పే­ద­లు, మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల వై­ద్య సేవలను ఉచితంగా అందించాలని వైఎస్‌ జగన్‌ పరితపించారు. మన ఇంట్లో వాళ్లు ఆస్పత్రికి వెళితే ఎలాంటి సేవలు అందాలని కోరుకుంటామో.. ఆస్పత్రుల్లో అందరికీ అలాంటి సేవలు అందించాలని అధికారులు, సిబ్బందికి పదే పదే సూచించడం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. కూటమి నేతల మాటలు నమ్మి వాపును చూసి బలం అనుకున్నాం. ఏడాదిలోనే తెలిసొస్తోంది’ అని ఒంగోలుకు చెందిన ఓ చిరుద్యోగి వ్యాఖ్యానించారు.   

అది ఉండనే ఉందిగా... మళ్లీ ఇదీ ఎందుకు?  
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో చిత్రమైన వాదనను వినిపిస్తోందని ప్రజలు తెలిపారు. ఎలాగూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘‘ఆయుష్మాన్‌ భారత్‌’’ స్కీమ్‌ అమల్లో ఉన్నందున ప్రత్యేకంగా ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం లేదన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉందంటున్నారు. దాంతో మళ్లీ ఆరోగ్యశ్రీ కింద మరిన్ని చికిత్సల కవరేజీ అవసరం లేదనీ, అసలు ఈ పథకానికి ఇన్ని నిధులు అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న దుర్మార్గ స్థితి నెలకొంది. 

ఎన్నికల హామీల్లో భాగంగా మునుపు అమలవుతున్న ఏ పథకాన్నీ తీసేయబోమనీ, కావాలంటే ఆ జా­బితాకు మరికొన్ని చేరుస్తామంటూ వాగ్దానాలు చేసే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ‘గతంలో అమలైన అనేక పథకాలకు మంగళం పాడింది. ప్రాణాలు పోసే వైద్య రంగంలోని సేవలనూ మినహాయించక పోవడం దుర్మార్గం.. ముష్టిగా ఓ వెయ్యి ఎగస్ట్రా పడేసి.. రూ.వేలు విలువైన సేవలను అన్యాయంగా తీసేసింది’ అని ఓ వృద్ధుడు వాపోయాడు.   

ప్రభుత్వ వైద్య కళాశాలలపై కక్ష! 
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 వైద్య కళాశాలలను తెరవాలనే సంకల్పంతో గత సర్కా­రు అనుమతులను తెచ్చుకుంది. ఆ మేరకు ప్ర­తి ప్రభుత్వ ఆసుపత్రికి ఓ టీచింగ్‌ హాస్పిటల్‌ ఉండటం తప్పనిసరి కావడంతో.. రాష్ట్రంలోని పలు కీలక ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా ఈ కళాశాలలు తెరిచే దిశగా వేగంగా అడుగులు ముందుకు వేసింది. తొలి దశలో ఐదు మెడికల్‌ కళాశాలలను ప్రారంభించింది. 

మలి దశలో ఇంకొన్ని సిద్ధం చేసింది. అంతలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వాటికి కొర్రీ వేసింది. పులివెందుల కళాశాలకైతే మంజూరైన ఎంబీబీఎస్‌ సీట్లను సైతం వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం క్షమార్హం కాదని గుంటూరులో ఓ మెడికల్‌ షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కళాశాలలన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌ వారికి కట్టబెట్టడానికి చేయాల్సిందంతా చేస్తోంది.

అన్నింటా విఫలం.. అందరి నోటా అదే మాట 
గత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ చాలా సమర్థవంతంగా జరిగింది. 2020 – 2022 మధ్యకాలంలో కరోనా వైరస్‌ విజృంభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విరివిగా అందాలనే ఉద్దేశంతో పీహెచ్‌సీలను మరింత బలోపేతం చేయడం, డాక్టర్‌ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యత ఇచి్చంది. వైద్యుల పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసింది. ఒక పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లను నియమించింది. ఒక డాక్టర్‌ పీహెచ్‌సీలో ఉంటే, మరో డాక్టర్‌ తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించేలా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసింది. 

ఆ గ్రామాలకు వెళ్లే వైద్యుడు అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి మంచి వైద్యం అందించే వారు. మంచంలో ఉన్న రోగుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లేవారు. ఇప్పుడు ఇదంతా గతం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు తగినన్ని ప్రణాళికలు ఎలాగూ రచించడం లేదు సరికదా... ఉన్నవే చెరిపేస్తున్నారన్న భావన ఈ ఏడాది కాలంలో ప్రజల్లో బలంగా వేళ్లూనుకుంది. ఆరోగ్య సేవల అందుబాటు విషయంలో పురోగతి చాలా పరిమితమేనంటూ గతంలో నిరంతరం సెలైన్‌లా అందుతున్న సేవలు ఇప్పుడు కోమాకు వెళ్తున్న చందంగా ఉన్నాయని సామాన్యులు ప్రభుత్వ పనితీరుపై పెదవి విరుస్తున్నారు. 

మొత్తం మీద ఎటు చూసినా... గతేడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆరోగ్య రంగం నిర్వహణ చాలా పేలవంగా ఉందనే విమర్శ వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వంపై చాలా మంది చాలా ఆశలు పెట్టుకోగా, అన్ని రంగాల్లోనూ విఫలమైందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైద్యం దీనంగా మారడం, ఆరోగ్య శ్రీ నిర్వీర్యం,  కొత్త మెడికల్‌ కాలేజీలకు నో చెప్పడం, పీపీపీకి ప్రోత్సాహం, కార్పొరేటు ఆసుపత్రుల సంపద పెంచేలా చర్యలు తీసుకోవడం, గ్రామీణులకు వైద్య సదుపాయాలను మరింత మృగ్యం చేయడం మినహా వైద్య, ఆరోగ్య రంగంలో ఈ ప్రభుత్వం సాధించిందంటూ ఏమీ లేదని ప్రజలు ఊరూరా చెప్పుకుంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement