విశాఖ, విజయవాడ, మల్లవల్లిలో భూ సంతర్పణ
మల్లవల్లి ఫుడ్‌పార్క్ కారుచౌకగా లులు గ్రూప్ పరం
అధునాతన ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏటా రూ.50 లక్షల అద్దె చొప్పున 66 ఏళ్లకు లీజు
అద్దె కూడా ఐదేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున మాత్రమే పెంపు
గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాసెసింగ్ సెంటర్ ఏటా రూ.1.92 కోట్ల అద్దెకు జియోన్ బేవరేజెస్‌కు అప్పగింత
లులు కోసం నాలుగు రెట్లు తగ్గించేసిన కూటమి సర్కారు
మొన్న విశాఖ బీచ్ సమీపంలో రూ.700 కోట్ల విలువైన స్థలం.. నిన్న బెజవాడలో రూ.600 కోట్ల విలువైన భూమి.. ఇప్పుడు మల్లవల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్.. అన్నీ లులు గ్రూప్ గూటికే..
బాబు సర్కారు నజరానాలపై మండిపడుతున్న ప్రజాసంఘాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంపదను అప్పనంగా దోచిపెడుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడలో అత్యంత ఖరీదైన భూములను లులు గ్రూప్‌నకు అడ్డగోలుగా పంచిపెట్టిన చంద్రబాబు సర్కారు తాజాగా మల్లవల్లి మెగా ఫుడ్‌పార్కును కూడా రాసిచ్చేసింది! 7.48 ఎకరాల్లో విస్తరించిన మెగా ఫుడ్ పార్క్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతను లులు గ్రూపు సంస్థ ఫెయిర్ ఎక్స్‌పోర్ట్ ఇండియాకు కారుచౌకగా అప్పగిస్తోంది. గంటకు ఆరు టన్నుల మామిడి, జామ, టమోటా లాంటి సీజనల్ ఉత్పత్తులను గుజ్జుగా మార్చి ప్యాకింగ్ సామర్థ్యంతో పాటు 4,009 టన్నుల వేర్‌హౌస్, 3,000 టన్నుల కోల్డ్‌స్టోరేజ్ సామర్థ్యం ఇక్కడి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ఉంది.
అలాంటి యూనిట్‌ను నెలకు రూ.4.16 లక్షలు చొప్పున ఏడాదికి రూ.50 లక్షల అద్దెకు లులు పరం చేసేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణను జియాన్ బేవరేజెస్‌కి నెలకు రూ.16 లక్షలు చొప్పున ఏడాదికి రూ.1.92 కోట్లు అద్దె చెల్లించేలా ఐదేళ్ల కాలానికి 2023లో అప్పగించింది. అంతేకాదు.. ఏటా 10 శాతం చొప్పున అద్దె పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. రెండేళ్ల తర్వాత కూటమి సర్కారు అదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అతి తక్కువ రేటుకు అప్పగిస్తుండంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక అద్దె కూడా ఏటా కాకుండా ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అది కూడా కేవలం 5 శాతమే పెంచుతామనడం వెనుక ఆరి్థక లావాదేవీలున్నట్లు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐసీసీ)లో చర్చ జరుగుతోంది. ఎక్కడైనా సరే అద్దెలు పెరగడం సాధారమణని, కూటమి సర్కారు మాత్రం ఏకంగా నాలుగు రెట్లు తగ్గించేసి ఖజానాకు భారీగా గండి కొట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబు సర్కారు నజరానాలపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
విశాఖలో దారుణం..
విశాఖలో వాల్తేరు హార్బర్‌పార్కు వద్ద బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన 13.74 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు గ్రూప్‌నకు 99 ఏళ్లకు అత్యంత తక్కువ ధరకే లీజుకు ఇచ్చింది. ఏటా కేవలం రూ.7.08 కోట్ల అద్దెపై అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అద్దె కూడా పదేళ్లకు ఒకసారి అది కూడా పది శాతం చొప్పున మాత్రమే పెంచడానికి పచ్చ జెండా ఊపింది. విశాఖలో లులు నిర్మించే షాపింగ్ మాల్ 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
రూ.679.50 కోట్ల విలువైన భూమిని లులుకు అడ్డగోలుగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాన్ని రద్దు చేసి భూమిని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ)కు అప్పగించింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన వెంటనే వీఎంఆర్‌డీఏ నుంచి భూమిని ఏపీఐఐసీకి అప్పగించి.. ఇప్పుడు లులుకు కట్టబెట్టింది.
ఆర్టీసీ భూములు హస్తగతం..
విజయవాడ నడి»ొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు చేతిలో పెట్టింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.600 కోట్లపైనే ఉంటుంది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనుంది. 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇలా విశాఖ, విజయవాడ, మల్లవల్లిలో కలిపి ఇప్పటి వరకు 25.37 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం లులు చేతిలో పెట్టేసింది.


