మడకశిరలో చిరిగిన విస్తరాకులా టీడీపీ 

Madakasira TDP split into Two groups - Sakshi

సాక్షి, సత్యసాయి జిల్లా: మడకశిరలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఒక వర్గానికి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మరొక వర్గానికి నాయకత్వం వహిస్తుండడంతో ఆ పార్టీ పరిస్థితి చిరిగిన విస్తరాకులా తయారైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలోనే పార్టీలో ఇరువర్గాల నాయకులు ఎవరికివారు పైచేయి సాధించడానికి పరస్పరం ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. వైరి వర్గాల నేతలు నెలకు మూడు నాలుగు సార్లు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి పెద్దలను కలిసి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.  

చంద్రబాబును కలిసిన ఈరన్న వ్యతిరేక వర్గం  
టీడీపీ అధినేత చంద్రబాబును బుధవారం మాజీ ఎమ్మెల్యే ఈరన్న వ్యతిరేక వర్గం కలిసింది. టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్, బీసీ సెల్‌ అధ్యక్షుడు తిప్పేస్వామి, టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నరేష్‌ తదితరులు చంద్రబాబు, అచ్చెన్నాయుడుని కలిసి ఈరన్నకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని రాత పూర్వకంగా ఫిర్యాదు అందించారు.  

ఇప్పటికే గుండుమలపై ఫిర్యాదు.. 
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం కూడా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గంపై ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారని, ఇన్‌చార్జ్‌కు వ్యతిరేకంగా పని చేస్తూ పార్టీ కట్టుబాట్లను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతితో పార్టీ నష్టపోయిన తీరుపై కూడా మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మడకశిర టీడీపీ వ్యవహారం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది. గతంలో చంద్రబాబు రెండు వర్గాల నేతలను మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించి పంచాయతీ చేసి పంపినా ప్రయోజనం లేకుండా పోయింది.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top