బస్సు దగ్ధం ఘటనలో సజీవ
దహనమైన నలుగురికి అంత్యక్రియలు
మిన్నంటిన కుటుంబ సభ్యులు,
బంధువుల రోదనలు
ఊరు ఊరంతా వచ్చి వీడ్కోలు
వింజమూరు (ఉదయగిరి): ‘కడసారిది వీడ్కోలు.. కన్నీటితో మా చేవ్రాలు.. కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల మధ్య ఊరంతా తరలివచ్చి.. కర్నూలులో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనమైన గోళ్ల రమేష్, భార్య అనూష, ఇద్దరు పిల్లలు మన్విత, శశాంక్ అంత్యక్రియలు సోమవారం గోళ్లవారిపల్లిలో విషణ్ణ వదనాల మధ్య నిర్వహించారు.
భగవంతుడా.. మాకే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావయ్యా.. మేము చేసిన పాపం ఏమిటీ? కనికరం లేదా ఆ బిడ్డలైనా బతికించకూడదా అంటూ మృతుల బంధువులు రోదించడం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యమయ్యారు. అగ్ని కీలల్లో చిక్కొని బొగ్గులైన మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరూ పగ వారికి కూడా ఇంత కష్టం రాకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ , భార్య, బిడ్డలకు డీఏన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించి ఆదివారం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. రాత్రికి గోళ్లవారిపల్లికి ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా చేర్చారు. సోమవారం ఉదయం అంతమయాత్ర నిర్వహించారు.
ఆ కుటుంబాలను ఆదుకుంటాం
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ బాఽధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొంటామని తెలిపారు. ఇప్పటికే టీడీపీ తరఫున రూ.10 లక్షలు వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి రూ.5 లక్షలు, కాకర్ల ట్రస్టు తరఫున తాను రూ.3 లక్షలు, స్వర్ణభారతి ట్రస్టు వారు రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షలు వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బస్సుకు సంబంధించి బీమాతో పాటు మరికొంత సహాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గూడా నర్సారెడ్డి, జూపల్లి రాజారావు, ఎంపీపీ మోహన్‌రెడ్డి, బండారు సత్యనారాయణ, మాజీ ఎంఈఓ జి.ఓబులరెడ్డి, కలిగిరి సీఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.


