ఏరు దాటాక... బోడి మల్లయ్య అంటున్న పవన్‌! | KSR Comments On Deputy Chief Minister Pawan Kalyan Over His Remarks On Kapu Community And Political Position In AP | Sakshi
Sakshi News home page

ఏరు దాటాక... బోడి మల్లయ్య అంటున్న పవన్‌!

May 29 2026 11:20 AM | Updated on May 29 2026 12:48 PM

KSR Comments On Deputy Chief Minister Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు కుల నేతలకు సవాలు విసిరారా? బెదిరించారా? రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్‌ వ్యాఖ్యలు చూస్తూ ఇలా అనిపించకమానదు. కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కులాన్ని దాటి వెళ్లలేరా అని ఆ సమావేశంలో వ్యాఖ్యానించిన పవన్‌ ఎన్నికల సమయంలో ‘‘ఆంధ్ర భావన లేకపోతే మానె.. కాపు భావనతోనైనా ఓట్లు వేయాలి’’ అని కోరిన విషయం మరచినట్టున్నారు. అంతేనా... కాపుల మద్దతుతో గెలవాలన్న ఉద్దేశమే లేకపోతే 2019లో ఆ సామాజిక వర్గం అధికంగా ఉండే భీమవరం, గాజువాకల నుంచే ఎందుకు పోటీ చేసినట్టు? రెండో చోట్లా ఓడిపోయేందుకు ఇతర కారణాలు ఉండవచ్చు. 

అది వేరే సంగతి. 2024లోనూ ఆయన కుల మద్దతు కోసమే కదా ఏరి కోరి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నది? ఈ విషయాలన్నీ జనసేనతోపాటు రాజకీయ పక్షాల వారందరికి తెలియదా! జనసేనలో ఎక్కువ మంది కాపులకే ఎందుకు టిక్కెట్లు ఇచ్చారు? ఏపీ కేబినెట్‌లో జనసేన మంత్రులు ముగ్గురు ఉంటే, పవన్‌తోపాటు కాపు వర్గానికే చెందిన మరొకరికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇలాంటి వాటితో సరిపెడితే పోతుందని ఆయన అనుకున్నారేమో కాని, కాపు సామాజిక వర్గం సంతృప్తి చెందలేదు. ఇప్పుడేమో తాను కులం కోసం రాజకీయాల్లోకి రాలేదంటున్నారు.

సినిమా నటుడిగా అన్ని వర్గాల అభిమానులు ఉండవచ్చు. కాని వారిలో కాపులు.. మరీ ముఖ్యంగా యువత ఎక్కువ అన్నది బహిరంగ రహస్యమే. వీరంతా గత ఎన్నికలలో అండగా నిలబడింది వాస్తవం కాదా! వారంతా ఏమని అనుకున్నారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకునే సందర్భంలో జనసేనకు కనీసం 50 అసెంబ్లీ స్థానాలు డిమాండ్‌ చేస్తారని, రెండేళ్లు సీఎంగా ఉండేలా ఒప్పందం కుదుర్చుకుంటారని అనుకుంటే నిరాశపరిచారు. పోనీలే.. భవిష్యత్తులోనైనా  కాపు వర్గం నేతగా పవన్ ముఖ్యమంత్రి కాకపోతారా అని సరిపెట్టుకుంటే, పదిహేనేళ్లపాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని చెప్పడం విని వారంతా నిర్ఘాంతపోయారు. చంద్రబాబు కాకపోతే ఆయన కుమారుడు లోకేశ్‌కు పట్టం కట్టినా ఓకే అన్నట్టుగా పవన్‌ ఈ పదిహేనేళ్ల రాగం అందుకున్నారన్నది అధికుల అభిప్రాయం. 

ఒకవైపు జనసేన కార్యకర్తలు, కొన్నిచోట్ల నాయకులు కూడా టీడీపీ వారి దౌర్జన్యాలకు గురవుతుంటే, ఎందుకు పవన్ నోరెత్తి గట్టిగా మాట్లాడడం లేదన్నది పలువురి ప్రశ్న. ఇలా ఇబ్బంది పడుతున్న వారిలో కాపు సామాజికవర్గం వారే ఉన్నారని ఆ సంఘం నేత దాసరి రాము చెబుతున్నారు. కాపునేత అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే సరికాదని చిన్న మాట అనలేకపోయారు. అంబటి వైసీపీ నేతగా కాకున్నా ముందు కాపు వర్గం నేత కూడా. ఇలాంటి విషయాలలో కూడా రాజకీయంగానే ఆలోచిస్తారా? ఇవన్ని ఒక ఎత్తయితే తనను విమర్శించే కాపు నాయకులంతా ఏకాభిప్రాయంతో ఒక  సీఎం అభ్యర్ధిని పెట్టుకుని గెలిపించుకోవాలని పవన్‌ చెప్పడం ఇంకో ఎత్తు. ఒక రకంగా కాపు సామాజిక వర్గానికి సవాలు విసిరారు అన్నమాట. ఒకవైపు కులం కోసం రాజకీయాలలోకి రాలేదంటూనే, మరో వైపు కాపుల్లో తన స్థాయి నేత ఇంకెవరూ లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది పవన్‌ రాజకీయ భవిష్యత్తుకు అంత మంచిది కూడా కాదు.

 తాము సీఎం అవ్వాలని కోరుకున్న వ్యక్తే కాడి పారేసి తమ వర్గం ప్రయోజనాలను కాలరాసేలా మాట్లాడితే ప్రత్యామ్నాయ నేతను వెతుక్కునే అవకాశం ఉంటుంది. పవన్ సీఎం కానప్పుడు ఏ పార్టీ తమకు మేలు చేస్తుందో ఆ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది. కాపు నేస్తం వంటి స్కీములు అమలు చేయడంతోపాటు , అనేక మంది కాపు నేతలకు మంచి గుర్తింపు ఇచ్చిన వైసీపీనే బెటర్ అని వారు భావించే అవకాశం ఉంది. ప్రస్తుతం కాపు సామాజికవర్గంలో అదే పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. అందువల్లే దాసరి రాము, ఒ.వి.రమణ వంటివారు ఆవేదనతో వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. కాపుల అండ లేనిదేనే ఉప ముఖ్యమంత్రి అయ్యారా అని రాము  ప్రశ్నిస్తే, సీఎం పదవి చేపట్టలేని సిగ్గు లేని జాతి మాది అని మరో కాపు నేత, టీటీడీ మాజీ సభ్యుడు రమణ వ్యాఖ్యానించారు. కులం వద్దని పవన్‌ నిజంగా అనుకుంటూంటే తనకు కాపు జాతి వద్దని ప్రకటించాలని అన్నారు. కాపు కులం లేకపోతే చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చేవారా అని ఆయన ప్రశ్నించారు. 

కాపు నేతలు మాట్లాడితే వంగవీటి రంగా ప్రస్తావన తీసుకు వస్తున్నారని, ఆయన భార్య కమ్మ అని, వారి బిడ్డలు రెండు కులాలకు చెందినవారు అవుతారని పవన్ చిత్రమైన వాదన చేశారు. తాను సనాతని అంటూ హడావుడి చేసిన పవన్ వ్యక్తిగత జీవితం మాటేమిటి అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అనవసర విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రంగా బతికి ఉన్నప్పుడు కాపు నేతలు మాట్లాడలేదని పవన్ అనడం సరికాదు. రంగా కాంగ్రెస్ నేతగా ఉండి కాపులతోపాటు పేద వర్గాలను ఆకట్టుకోవడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అది ఆయనకు ప్రజాబలం పెంచింది. ఆ క్రమంలో ఆయన ఆయా జిల్లాలలో టూర్ చేసినప్పుడు కాంగ్రెస్ కాపు నేతలు బాగా ఆకర్షితులయ్యారు. తాను కూడా వంగవీటి రంగాకు టీ ఇచ్చానని పవన్ ఎందుకు చెప్పుకున్నారు? రంగా హత్యకు గురైనప్పుడు పార్టీలకు అతీతంగా హత్యను ఖండించడమే కాదు. కృష్ణా నది తిన్నెలపై కాపునాడు సభ జరిగితే పార్టీలకు అతీతంగా పెద్ద, పెద్ద నేతలు హాజరయ్యారు. 

ఆ రోజుల్లో టీడీపీ ఎంపీగా ఉన్న నిశ్శంకరరావు వెంకటరత్నం కాపునాడుకు వెళ్లారు. అప్పట్లో టీడీపీలో మంత్రిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. రంగా హత్య చంద్రబాబుకు తెలిసే జరిగిందని ఏకంగా తన పుస్తకంలోనే రాశారు. మరో నేత ముద్రగడ పద్మనాభం కాపులను ఏకతాటిపైకి తీసుకు వచ్చిన కృషి చిన్నది కాదు. చంద్రబాబు ప్రభుత్వం ఆయనను, కుటుంబాన్ని ఏ  విధంగా బాధించింది పవన్‌కు తెలియదా! ఆ రోజుల్లో పవన్ సంఘీభావం చెప్పారో, లేదో కాని దాసరి నారాయణరావు,  చిరంజీవి వంటి ప్రముఖులు మద్దతు ఇచ్చారు. ముద్రగడను పరామర్శించడానికి వెళుతుంటే చంద్రబాబు  ప్రభుత్వం వీరిని రాజమండ్రి ఎయిర్ పోర్టు వద్ద నిలువరించిందన్న సంగతి గుర్తు ఉండకపోవచ్చు. చంద్రబాబు ఒకరి నాశనం కోరుకునే వ్యక్తి కాదని పవన్ కళ్యాణ్ చెబుతుంటే కాపులే బిత్తరపోతున్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు పాలనలో ఎంతమంది కాపులతోసహా వివిధ వర్గాల వారు ఎంత నాశనమైంది పవన్‌కు తెలియపోవచ్చని ఆ వర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నారు కనుక అంతా బాగానే ఉండవచ్చు. కాని ఈ మధ్య జనసేన ఎంపీ బాలశౌరి కూటమిపై  చేసిన వ్యాఖ్యలే ఈ ప్రభుత్వం పనితీరుకు దర్పణం పడతాయి. కాపు నేతలు కొందరు చంద్రబాబు పాలనలో నాశనమైందీ లేనిది ఆ వ్యాఖ్యల ద్వారా తెలుసుకోవచ్చు.  తాను దేశం, నేల, రాష్ట్రం కోసమే వచ్చా..ఎప్పుడూ  కులం గురించి మాట్లాడలేదు.. సీఎం అయ్యే తెలివితేటలు లేకకాదు..సమాజ మార్పు  కోసం వేచి చూశానని పవన్ అనడం అచ్చం సినీ డైలాగుల మాదిరి అనిపించడం లేదూ! పార్టీ నడిపే శక్తి లేదని ఆయనే చెబుతారు. తనకు సీఎం అయ్యే తెలివి ఉందని ఆయనే అంటారు. దేన్ని నమ్మాలి! సినిమా గ్లామర్ ద్వారా రాజకీయాలలోకి వచ్చి, కాపుల అండతో పైకి వచ్చి, ఇప్పుడు  కులం ఏమిటంటూ సిద్దాంతాలు చెప్పడం అమాయకుల సంగతేమో కాని,విషయ పరిజ్ఞానం కలిగిన వారెవరైనా విశ్వసిస్తారా!

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
 
Advertisement
Advertisement