లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్‌ లొకేషన్స్‌.. ఎక్కడంటే!

Koraput Rayagada Train Journey: Enticing, Thrilling Experience to Travellers - Sakshi

కోరాపుట్‌–రాయగడ (కే–ఆర్‌) లైన్‌లో అద్భుత దృశ్యాలు

బొర్రా, అరుకును మించి అద్భుత సొరంగాలు

పర్యాటకులకు కనువిందు చేసే లొకేషన్స్‌ 

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అద్భుతమైన ప్రకృతి అందాలు, ఎత్తయిన, పచ్చని కొండలు, వీటిని మించి మరపురాని సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మన పక్కనే ఉన్న ఒడిశాలోని కోరాపుట్‌కు వెళ్తే చాలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతమతాయి. అవేమిటో.. ఈ రూట్‌ విశేషాలను పర్యాటక ప్రేమికుల కోసం ప్రత్యేకం..


కే–ఆర్‌ (కోరాపుట్‌–రాయగడ) రైల్వే లైన్

వాల్తేర్‌ డివిజన్‌కు ప్రధానంగా ఆదాయాన్నిచ్చే కిరండూల్, బచేలిలో ఉన్న ఐరన్‌ ఓర్‌ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా వేరే లైన్‌ను ఏర్పాటుచేసి ఈ సరకు రవాణాను మరింతగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో 1980లలో కోరాపుట్‌ – రాయగడ (కే–ఆర్‌) లైన్‌ను ప్రారంభించగా.. 1993–92మధ్య ఈ లైన్‌ పూర్తయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1995 అక్టోబర్‌ 31న ప్రారంభించారు. 


కోరాపుట్‌ నుంచి రాయగడకు మొత్తం 167 కిలోమిటర్ల మేర ఈ లైన్‌ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 36 సొరంగాలు, 76 ప్రధాన వంతెనలు, 180 అందమైన మలుపులు ఉన్నాయి. అప్పట్లో ప్రధానంగా ఈ మార్గం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్, వైజాగ్‌ పోర్ట్‌ ట్రస్ట్‌లకు అసవరమైన ఐరన్‌ఓర్‌ను రవాణాను పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించేవారు. 


పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి 

ఈ మార్గంలో అల్యూమినా పౌడర్‌ సరఫరా చేసే నాల్కో, ఉత్కళ్‌ అల్యూమినా, వేదాంత, జేకే పేపర్, ఇంఫా (ఇండియా మెటల్‌ అండ్‌ ఫెర్రో అల్లాయ్‌), హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌ వంటి పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండో లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2015–16లో రూ.2500 కోట్లు బడ్జెట్‌ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026నాటికి రెండోలైన్‌ పూర్తి చేయనున్నారు. 


పర్యాటక, పుణ్యక్షేత్రాల సమాహారం... 

  •      ఆంధ్రా, ఒడిశా సదరన్‌ డివిజన్‌లో ప్రసిద్ధిచెందిన మజ్జిగైరమ్మ ఆలయం రాయగడ ప్రాంతంలోనే ఉంది 
  •      రాయగడకు కేవలం 50కి.మీల దూరంలో చిత్రకోన వాటర్‌ ఫాల్స్‌  
  •      తెరుబలిలో గల ఇంఫా ప్యాక్టరీ వద్ద ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయం 
  •      కోరాపుట్‌లో రాణి డుడుమ వాటర్‌ఫాల్స్, జగన్నాథస్వామి ఆలయం 
  •      గుప్తేశ్వర గుహలు 
  •      డియోమలి హిల్స్‌ కూడా కోరాపుట్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. 
  •      కోరాపుట్‌లోనే కోలాబ్‌ రిజర్వాయర్‌ కూడా ఉంది. 


గుహల్లో, వంతెనలపై మరపురాని ప్రయాణం

ఈ మార్గంలో సొరంగాలలో నుండి రైలు దూసుకుపోతుంటే ఆ అనుభూతులే వేరు. సుమారు 36 చిన్న, పెద్ద సొరంగాలు. ఈ మార్గంలోనే రౌలీ స్టేషన్‌కు సమీపంలో తూర్పుప్రాంతంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం ఉంది. దీని పొడవు 1,599 మీటర్లు (1.59 కిలోమిటర్లు). ప్రకృతి సోయగాలు, లోతైన, ఎత్తైన కొండలపై ప్రయాణం. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో కోరాపుట్‌ రైల్వే స్టేషన్‌.


అందమైన వంతెనలు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్గంలో ఉన్నాయి. సాధారణంగా అరకు, బొర్రాగుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు, కానీ ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. 


వెలుగులోకి తీసుకువచ్చిన వాల్తేర్‌ డివిజన్‌  

కోరాపుట్‌–రాయగడ రైల్వే మార్గం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. వాల్తేర్‌ డివిజన్‌కు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ గా వచ్చిన అనూప్‌కుమార్‌ సత్పతి అతి తక్కువ సమయంలో ఈ మార్గంలో పర్యటించి, తనిఖీలు చేసి దీనిని పర్యాటకులకు పరిచయం చేశారు. ఈ మార్గంలో పర్యాటకుల కోసం తొలిసారిగా విస్టాడోమ్‌ కోచ్‌ను జతచేశారు. వారానికి మూడుసార్లు నడిచే విశాఖపట్నం–కోరాపుట్‌ స్పెషల్‌ ప్యాసింజర్‌ రైలుకు ఈ విస్టాడోమ్‌ కోచ్‌ జతచేస్తున్నారు. (క్లిక్ చేయండి: అడవుల్లోనూ ఆహార పంటలు)


20 ఏళ్ల తరువాత ప్రెస్‌టూర్‌... 

దాదాపు 20 ఏళ్ల తరువాత వాల్తేర్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో ఈ మార్గంలో శనివారం  ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో గల ప్రముఖ పాత్రికేయులకు ప్రెస్‌టూర్‌ను ఏర్పాటుచేశాం. బహుశా కొద్ది డివిజన్‌లు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తాయి. ఈ టూర్‌లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన పర్యాటకరంగ ప్రతినిధులు కూడా  పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు పరిచయం చేస్తే బాగుంటుంది. 
– అనూప్‌ కుమార్‌ సత్పతి, డీఆర్‌ఎం


అద్భుతంగా ఉంది 

మొదటిసారిగా ఈ ప్రాంతాలను సందర్శించా. విస్టాడోమ్‌కోచ్‌లో ప్రయాణించడం కూడా మరచిపోలేని అను భూతి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తనతో పాటు మార్కెటింగ్‌ డివిజన్‌ నుంచి కృష్ణమోహన్, రాజేంద్రరావు, లోకనాథరావు కూడా ఈ టూర్‌లో పాల్గొన్నారు.  
– కె హరిత, డివిజనల్‌ మేనేజర్, ఏపీ టూరిజం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top