ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది. అభినందించాల్సిందే కానీ.... అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలను చూస్తే మాత్రం ఆయన ఏ రకమైన రిఫార్మరో అర్థం కాదు. సంస్కరణలకు తానే ఆద్యుడని ఎంత ప్రచారం చేసుకున్నా.. అందులో నిజానిజాలేమిటో కూడా చూసుకోవాలి కదా? రెండేళ్లుగా ఆయన చేపట్టిన మహత్తర సంస్కరణలు ఏమిటన్నది ఎల్లోమీడియానైనా ఇస్తుందేమో అని చూశాను కానీ.. ఎక్కడా కనిపించలేదు. ‘‘రాజకీయ పాలన చేస్తామని, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేవారికి ఏ పని చేయవద్దు’’ అని రెడ్ బుక్ అరాచకాలతో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు పాలన ఏపాటి సంస్కరణో, అవార్డు ఇచ్చిన వారికే తెలియాలి.
వాస్తవానికి చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు హుందాగా, అబద్దాలు చెప్పకుండా... నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేయడం కాకుండా... ఆయన సంస్కరణలు చేసినా, చేయకపోయినా అవార్డు ఇవ్వడం తప్పు కాదు. ఒక వైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యం, పాలన రంగాలలో తీసుకు వచ్చిన అనేక సంస్కరణలను నీరుకార్చుతూ, ప్రజల కోసం సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్న చంద్రబాబు రిఫార్మర్ అవుతారని ఆ మీడియా ఎలా ప్రకటించిందో, దానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. కేంద్రం తీసుకువచ్చిన డ్వాక్రా మహిళల స్కీమ్, విద్యుత్ సంస్కరణలు తనవే అని ఆయన చెప్పుకుంటుంటారు.
ఫర్వాలేదు..వాటికి కట్టుబడి ఉంటే ఒప్పుకోవచ్చు.2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నిటిని మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.అది ఏ రకమైన సంస్కరణ అవుతుంది?. అలాగే రైతుల రుణాలన్నిటిని రద్దు చేస్తామని, బ్యాంకులలో తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపించే బాధ్యత తనదే అన్నారు.అసలు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇలా చేసిన నేతను సంస్కరణల సారథి అని చెబితే ఎలా ఒప్పుకోవాలి? పోనీ వీటిని అమలు చేశారా అంటే అదేమీ లేదు. డ్వాక్రా రుణాలను అసలు రద్దు చేయలేదు. రైతు రుణాలను అరకొరగా మాఫీ చేసి, ‘‘అన్నీ చేసేశాంగా, రైతుల ఆశకు హద్దు ఉండాలి’’ అని విసుక్కోవడం కూడా మనం చూశాం.
1999లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న విపక్ష కాంగ్రెస్ డిమాండ్‌పై ‘‘అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’’ అని వ్యాఖ్యానించింది కూడా ఈ చంద్రబాబే. అంతేకాక విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పెద్ద ఆందోళన వచ్చింది. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిగాయి. నలుగురు యువకులు మరణించారు. ఆ తర్వాత 2004లో టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపించారు. తద్వారా రైతులకు ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు కూడా సంస్కరణ మాట వదలి, ఉచిత కరెంట్ ఘనత తనదేనని పాట ఆరంభించుకున్నారు.2014 టర్మ్‌లో, ప్రస్తుతం ఆయన కూడా ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే, 2019-2024 మధ్య కేంద్రం సూచించిన మేరకు రైతులు వాడే విద్యుత్ లెక్కల నిమిత్తం మోటర్లకు మీటర్లు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్నా, మొత్తం వ్యయం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు కర్షకుల మోటార్లకు మీటర్లు పెడతారా అని గొడవ చేశారు.
ఇది సంస్కరణ వాది చేసే పనే అవుతుందా? లోకేశ్ మరో అడుగు ముందుకువేసి మీటర్లను పగలగొట్టాలని పిలుపు ఇచ్చారు. 2024లో పవర్ సాధించిన తర్వాత దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అదేం లేదు. మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతుంటే విజయనగరంలో ఒక ఇంటి యజమాని వాటిని పగలకొట్టి నిరసన తెలిపారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా భూముల రీసర్వే స్కీమ్ ను జగన్ చేపడితే, భూములు కాజేయడానికే అని అబద్దాలు నిత్యం ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అదే రీసర్వేని కొనసాగిస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం పరస్పర విరుద్దంగా వ్యవహరించడం సరైనదేనా? విజన్ 2020 ఉమ్మడి ఏపీలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు. అసలు విజన్ పేరుతో కథ నడిపిందే 2001-2002 ప్రాంతంలో అందులో ఉన్న విషయాలు చూసి ఐఎఎస్ లు, మేధావులు నవ్వుకునేవారు. ప్రచారం కోసం తప్ప ఆచరణ కానివని ఆ రోజుల్లో వారు వ్యాఖ్యానించేవారు.
2004లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది.ఆ తర్వాత విజన్ 2020 ఊసే లేదు. మరి ఉమ్మడి ఏపీలో ఆ విజన్ ఎప్పుడు అమలయ్యింది.దానివల్ల సాధించింది ఏమిటో తెలియదు. హైదరాబాద్ దాని ఫలితాలు చూస్తోందట. రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మాట నిజమే.కాని హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని, నగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటే అదెలా సాధ్యమో ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ఎందుకు అడగలేదో అర్థం కాదు. ఒక భవనం నిర్మించి దానికి హైటెక్ సిటీ అని, సైబరాబాద్ అని పేర్లు పెడితే నగర నిర్మాణం చేసినట్లా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లను ఆయన ప్రస్తావించారు. జగన్ టైమ్ లో ఈజ్ఆఫ్ డూయింగ్‌లో దేశంలో కొన్నిసార్లు నెంబర్ ఒన్ స్థానంలో ఉండేది.
చంద్రబాబు పాలనలో ఎన్నిసార్లు నెంబర్ ఒన్ అయింది?అమరావతి ద్వారా మరో నగర నిర్మాణం చేసే అవకాశం వచ్చిందట. అంటే హైదరాబాద్ తానే నిర్మించానని చెప్పుకుంటున్నారా?దీనిపైనే తెలంగాణ నేతలు తీవ్ర ఆక్షేపణ చెబుతుంటారు.కులి కుతుబ్ షా 400 ఏళ్ల క్రితం నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతే తప్ప మొత్తం నగరాన్ని అంతటిని ఆయన నిర్మించలేదు. అలా చేస్తానని చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రం పదే,పదే నగర నిర్మాణం తనదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అమరావతి పేరుతో నగర నిర్మాణం చేపడుతున్నానని చెబుతున్నారు.దీనికోసం లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించడానికి వెనుకాడడం లేదు. ఏభైవేల కోట్ల అప్పు ఇప్పటికే చేశారు.ఇది ఏ రకమై సంస్కరణ అవుతుంది? ఏ రకమైన ప్రగతి అవుతుంది?
అప్పు చేసి పప్పు కూడా తినడం సంస్కరణ అని అంటారా? హైదరాబాద్ లో అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లు, బంగ్లాలు అన్ని కలిపి కేవలం 2250 ఎకరాలలో ఉన్నాయని మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ చెప్పారు.అది నిజమే.కేవలం ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కలిపి హైదరాబాద్ లో ఉన్నది 300 ఎకరాల లోపే. కాని అమరావతిలో 54 వేల ఎకరాలు సేకరించడమ కాక, మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. ఎకరాకు రెండు కోట్ల చొప్పున ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేయడం ప్రజలకు ఎలా ప్రయోజనం అవుతుంది? ప్రభుత్వ ధనం ఈ రకంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏమిటని ఎకనమిక్ టైమ్స్ ఎందుకు ప్రశ్నించదు? వరదలను అరికట్టడానికి వేల కోట్ల వ్యయంతో పలు రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు నిర్మించడం ఏ నగరంలో అయినా ఉందా?ఇవన్ని ఒక ఎత్తు అయితే ,ఇంత పెద్ద సంస్కరణవాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఏ రకమైన హామీలు ఇచ్చారు? ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తానని ప్రకటించడం రిఫార్మ్ అవుతుందా? పోనీ దానిని అమలు చేశారా? నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్న రూ.మూడు వేలు ఇవ్వకపోవడం సంస్కరణ అని చెప్పుకోవాలా? ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎగవేశారు.
ఇలా అనేక హామీలు ఎండమావిగా మిగిలాయే! రూ.3.55 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించడం ఏ విధమైన సంస్కరణ? సంపద సృష్టికి సంస్కరణలే కీలకం అని చెబుతున్న చంద్రబాబు వాటిపై ఒక నిర్దిష్ట విధానం కలిగి ఉన్నారా? కేవలం అవకాశవాద రాజకీయాలతో ఎప్పటికప్పుడు తను చెప్పినవాటికి తానే విరుద్దంగా వ్యవహరిస్తూ సంస్కరణల గురించి మాట్లాడితే రిఫార్మిస్ట్ అయిపోతారా? ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేది రిఫార్మ్ అయితే చంద్రబాబుకు అవార్డు ఇవ్వడం తప్పుకాదు.

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


