తిరువూరులో ఎనీ టైం కిక్కు! | Kolikapudi WhatsApp Status On Liquor Mafia In Andhra Pradesh, Trigger Political Controversy | Sakshi
Sakshi News home page

తిరువూరులో ఎనీ టైం కిక్కు!

May 13 2026 6:02 AM | Updated on May 13 2026 11:45 AM

Kolikapudi WhatsApp Status Goes Viral: Andhra Pradesh

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్‌ స్టేటస్‌ , ఆలయాలు, అంబేడ్కర్‌ గురుకులం విద్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌

సంచలనం రేపుతున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి స్టేటస్‌

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో మద్యం మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గుడి, బడి..ప్రార్థనా మందిరాలు వంటి వాటి పక్కన పెట్టకూడదనే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి బార్‌ అండ్‌ రెస్టారెంట్లు వెలిశాయి. దీంతోపాటు గ్రామాల్లో ప్రజలకు తాగునీరు దొరకడం లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. వీధికో బెల్ట్‌షాపు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎనీ టైం మద్యం మాత్రం లభిస్తోంది. ఎక్సైజ్‌ అధికారులు సైతం మామూళ్ల మత్తులో జోగుతూ, తూతూమంత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మద్యం మాఫియా బరితెగిస్తోంది. బెల్ట్‌షాపుల్లో నకిలీ కిక్కు గుప్పుమంటోంది.

తిరువూరు నియోజకవర్గవ్యాప్తంగా 20 షాపులు ఉండగా, వీటికి అనుబంధంగా 640 బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. ఈ షాపుల నిర్వహణ వెనుక టీడీపీకి చెందిన పార్లమెంటు ముఖ్యనేత హస్తం ఉండడంతో, మద్యం మాఫియా మరింత రెచ్చిపోతోంది. సదరు నేతకు ప్రతి మద్యం షాపు నుంచి నెలకు రూ.లక్ష చొప్పున అంటే నెలకు రూ.20 లక్షలు చొప్పున ఏడాదికి రూ.2.40 కోట్లు దండుకుంటున్నారు. బెల్ట్‌ షాపు పెట్టుకునేందుకు మొదట్లో గుడ్‌విల్‌ కింద రూ.50 వేలు చొప్పున 640 బెల్ట్‌షాపులకు రూ.3.20 కోట్లు ముక్కు పిండి వసూలు చేశారు.

దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు, బెల్ట్‌షాపులు 24 గంటలు బార్లా తెరుచుకునే ఉంటున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు మద్యం బారిన పడి నాశనమవుతున్నాయి. పలు కుటుంబాలు చితికిపోయి వీధిన పడుతున్నాయి. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే పెడుతున్న స్టేటస్‌లు చంద్రబాబు సర్కారులో మద్యం, పేకాట వంటి అవినీతి అక్రమాలకు అద్దం పడుతున్నాయి. 

పేకాట, క్యాసినోలు.. 
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గంపలగూడెం మండలం ఊటుకూరు, విసన్నపేటలో పేకాట, క్యాసినో ఏర్పాటు చేశారు. ఆ మూడు రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్లకు పైగా దండుకున్నారని, దీని వెనుక పార్లమెంటు ముఖ్యనేత హస్తం ఉన్నట్లు టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. గతంలోనూ కొలికపూడి ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి.? పేకాట క్లబ్‌కా?, కొండ పర్వగట్టు దగ్గర డే అండ్‌ నైట్‌ మ్యాచ్, పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్‌..’’ అంటూ స్టేటస్‌ పెట్టడంతో అప్పుడు కూడా సంచలనంగా మారింది.

సంచలనంగా ఎమ్మెల్యే కొలికపూడి స్టేటస్‌..
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన స్టేటస్, అక్కడ మద్యం మాఫియా దందాకు అద్దం పడుతోంది. ‘‘తిరువూరులో అయ్యప్ప స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు, అంబేడ్కర్‌ గురుకులం ఎదురుగా  బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పెట్టారు. తియ్యమని చెప్పాను. బేరం మొదలు పెట్టారు. నెలకి లక్షన్నర.. బహుశా కల్తీ మద్యం అమ్ముతున్నారేమో’’ అంటూ ఎమ్మెల్యే పెట్టిన స్టేటస్‌ సంచలనంగా మారింది. 

పార్లమెంటు ముఖ్యనేత ప్రోద్బలంతో ఎక్సైజ్‌ అధికారులు సైతం రూ.5.లక్షలు తీసుకుని, నిబంధనలను తుంగలో తొక్కి బార్‌కు లైసెన్సు ఇచ్చినట్లు అక్కడ చర్చ సాగుతోంది.  గతంలో సైతం బస్టాండు సమీపంలో, దేవాలయాలకు దగ్గర మద్యం షాపులున్నాయని ఎమ్మెల్యే ధర్నా చేశారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఇష్టారీతిన మద్యం షాపులు పెట్టారనేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే స్టేటస్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement