తాడేపల్లి: వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.
ప్రజాసంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులు, కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. డీఎస్సీ అంశంపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింతగా తీసుకెళ్లాలి.
దీనిపై పార్టీ కమిటీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తీర్మానాలు చేసి వాటిని డిజిటల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి. ఇంటింటి సర్వే సమయంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. సర్వే ప్రారంభమయ్యేలోగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జూన్ 1న యువజన విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ అంశంపై చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి’’ అని చెప్పారు.


