
కాకినాడ: శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో ఈ నెల 3న మణికుమార్ (గబ్బర్‌సింగ్) అనే వ్యక్తి భార్యాభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధం కొనసాగించలేదనే కక్షే కారణమని పోలీసు విచారణలో తేలింది. బుధవారం అన్నవరం పోలీస్ స్టేషన్‌లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగధార గ్రామానికి చెందిన కాకూరి చంద్రయ్య (చంద్రబాబు) భార్య సూర్యావతితో అదే గ్రామానికి చెందిన మణికుమార్‌కు వివాహేతర సంబంధం ఉంది. కొంత కాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే ఇటీవల సూర్యావతి తన భర్త చంద్రయ్య వద్దకు వచ్చేసింది. తనను వదిలేసి వచ్చిందని సూర్యావతిపై మణికుమార్ కక్ష పెంచుకున్నాడు.
ఈ నెల 3న అర్ధరాత్రి చంద్రయ్య, సూర్యావతి వారి ఇంటి అరుగుపై నిద్రపోతుండగా మణికుమార్ వారిపై నాటు తుపాకీతో కాల్పులు జరపగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని డీఎస్పీ వివరించారు. మణికుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం పెదమల్లాపురం వద్ద ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి నాటు తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ వివరించారు.