జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగోళ్ల సత్తా | JEE Advanced results: Three out of top 10 are Telugu students | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగోళ్ల సత్తా

Jun 2 2026 3:43 AM | Updated on Jun 2 2026 3:43 AM

JEE Advanced results: Three out of top 10 are Telugu students

తల్లిదండ్రులతో ఆనందం పంచుకుంటున్న నాగ సహర్ష

టాప్‌–10లో ముగ్గురు తెలుగు విద్యార్థులు

టాప్‌–100లో 30 మంది విశాఖకు చెందిన కూచి సందీప్‌కి ఆలిండియా ఐదో ర్యాంకు 

2026 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 56,880 మంది అర్హత

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీల్లో (ఐఐటీ) ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌–10లో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండగా.. విశాఖకు చెందిన కూచి సందీప్‌ 318 మార్కులతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బి.జయకృష్ణ శ్రీనివాస్‌ 314 మార్కులతో 6వ, మేడిశెట్టి నాగసహర్ష 312 మార్కులతో 9వ స్థానం దక్కించుకున్నారు.

ఆలిండియా టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభం కుమార్‌ (360కి గాను 330) ఘనత సాధించారు. మహిళల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన అరోహి దేశ్‌పాండే 280 మార్కులతో అగ్రస్థానం దక్కించుకున్నారు. తొలి 10 స్థానాల్లో అత్యధికంగా ఐదుగురు ఐఐటీ ఢిల్లీ జోన్‌ విద్యార్థులు ఉండటం విశేషం. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్‌కు చెందిన వారు ముగ్గురు, ఐఐటీ బాంబేకు చెందిన విద్యార్థులు ఇద్దరున్నారు. ఐఐటీ రూర్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 1,87,389 మంది నమోదు చేసుకోగా 1,79,694 మంది పరీక్ష రాశారు. ఇందులో 56,880 మంది అర్హత సాధించారు. వీరిలో పురుష అభ్యర్థులు 46,773 మంది, మహిళలు 10,107 మంది ఉన్నారు.

టాప్‌–100లో ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులే అధికం
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో ఓబీసీ–ఎన్‌సీఎల్‌–పీడబ్ల్యూడీ విభాగంలో ఐఐటీ మద్రాస్‌ జోన్‌కు చెందిన నానాల నాగచైతన్య, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌లో బి.జయకృష్ణ శ్రీనివాస్‌ టాపర్లుగా నిలిచారు. మద్రాస్‌ జోన్‌ నుంచి వెల్దుర్తి హర్షిత్‌ 15వ ర్యాంక్, భువనేశ్వర్‌ జోన్‌ నుంచి రెడ్డి సాయిసాహితి 230 ర్యాంక్‌ పొందారు. జోన్ల వారీగా చూస్తే ఐఐటీ మద్రాస్‌ నుంచి అత్యధికంగా 14,294 మంది అర్హత సాధించారు.

ఆ తర్వాత ఐఐటీ బాంబే  12,389, ఐఐటీ ఢిల్లీ 10,697, ఐఐటీ రూర్కీ 5,637, ఐఐటీ కాన్పూర్‌ 5,552, ఐఐటీ భువనేశ్వర్‌ 5,428, ఐఐటీ గౌహతి 2,883 మంది ఉన్నారు. టాప్‌–100లో ఐఐటీ మద్రాస్‌ నుంచి 35 మంది, ఢిల్లీ 29, బాంబే 23, రూర్కీ నుంచి 9 మంది, కాన్పూర్‌ నుంచి ముగ్గురు, భువనేశ్వర్‌ నుంచి ఒకరు ఉన్నారు. టాప్‌–100లో 30 మంది వరకు తెలుగు విద్యార్థులు వివిధ జోన్లలో మంచి ర్యాంకులు సాధించారు. జోన్‌–2 నుంచి జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

చాలా కష్టపడ్డా..
జేఈఈ పరీక్ష కోసం చాలా కష్టపడ్డాను. నా తల్లిదండ్రులు మేడిశెట్టి అప్పారావు, రాజేశ్వరి, హైదరాబాద్‌ మాదాపూర్‌ చైతన్య క్యాంపస్‌ యాజమాన్యం ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. జాతీయస్థాయిలో టాప్‌ టెన్‌లో ఉంటానని ఊహించాను. నా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈలో సీటు సాధించడమే ప్రస్తుతం నా లక్ష్యం. నాకు వచ్చిన ర్యాంక్‌తో సాధిస్తానని నమ్మకం ఉంది. రానున్న రోజుల్లో మరింత ఉన్నతంగా రాణించి దేశానికి ఉపయోగపడే రీతిలో నా వంతు సేవలు అందించాలన్నదే నా కోరిక.
–  మేడిశెట్టి నాగ సహర్ష, జేఈఈ 9వ ర్యాంకర్, పెందుర్తి 

Advertisement
 
Advertisement
Advertisement