‘వైఎస్సార్‌సీపీ అంటూ తిరిగితే.. చంపేస్తాం!’ | JC Prabhakar Reddy followers have once again become agitated in Tadipatri | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌సీపీ అంటూ తిరిగితే.. చంపేస్తాం!’

Aug 8 2025 5:52 AM | Updated on Aug 8 2025 5:52 AM

JC Prabhakar Reddy followers have once again become agitated in Tadipatri

తాడిపత్రిలో జేసీ అనుచరుల రౌడీయిజం

వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులు 

హెల్మెట్లు, మాసు్కలు ధరించి అర్ధరాత్రి వేళ వీరంగం 

ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ దాడులు 

తాడిపత్రి టౌన్‌: టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు తాడిపత్రిలో మరోసారి రెచ్చిపోయారు. రౌడీల్లా మారి వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే దాడులు చేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్షావలి బుధవారం సాయంత్రం ప్రెస్‌మీట్‌లో బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం.. రాత్రికే వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులు జరగడం చూస్తే జేసీ అనుచరులే దాడులకు పాల్పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది.  

అర్ధరాత్రి వీరంగం 
బుధవారం అర్ధరాత్రి 8 మంది వ్యక్తులు ముఖాలకు మాసు్కలు, హెల్మెట్లు ధరించి పట్టణంలో ద్విచక్ర వాహనాలపై వీరంగం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెచి్చపోయారు. పట్టణంలోని చేనేత కాలనీలో ఉంటున్న గడ్డం పరమేశ్, చిన్నబజార్‌లో ఉన్న షబ్బీర్, రజక వీధిలో ఉన్న డీవీ కుమార్, లక్ష్మీరంగయ్య ఇళ్లపై రాళ్లు, బీరు సీసాలు, రాడ్లతో దాడులు చేశారు. 

గడ్డం పరమేష్‌ ఇంటి తలుపులు ధ్వంసం చేసి పరమేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పరమేష్‌కు మెడ, చేతులకు గాయాలయ్యాయి. షబ్బీర్‌ ఇంటిముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో పచ్చమూకలు ‘మరోసారి వైఎస్సార్‌సీపీ అంటూ కార్యక్రమాలు చేస్తే చంపేస్తాం’ అని గట్టిగా కేకలు వేస్తూ బెదిరింపులకు దిగినట్టు బాధితులు వాపోయారు.   

హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు 
తాడిపత్రిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయని, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, వారి అనుచరులు ఇష్టారీతిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం మానవ హక్కుల సంఘానికి (హెచ్‌ఆర్‌సీ) ఫిర్యాదు చేశారు. 

టీడీపీ నాయకుడు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్షావలి బుధవారం మీడియా సమావేశం నిర్వహించి ‘ఎవరైనా సరే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పెళ్లిళ్లకు, శుభకార్యాలకు తాడిపత్రి ఆహ్వానించినా, ఆయన పేరుమీద వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలు నిర్వహించినా దాడులు చేస్తామని హెచ్చరికలు చేశారు. అదేరోజు రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకులు గడ్డం పరమేష్, లక్ష్మీరంగయ్య, షబ్బీర్‌ ఇళ్లపై దాడులు జరిగాయి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ విషయాలన్నీ పోలీసులకు తెలిసినా కనీం ప్రాథమిక విచారణ కూడా చేయలేదన్నారు. కాగా.. పచ్చమూకల దాడిలో గాయపడిన, భయాందోళనతో ఇంటికే పరిమితమైన బాధిత కుటుంబాలను గురువారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement