
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతిలోని(Tirupati) వెంకటగిరిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై(Bojjala Sudhir Reddy) పోస్ట్ పెట్టినందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, టీడీపీ, జనసేన మధ్య రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు అరెస్ట్‌ను అతడి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
తిరుపతిలో కూటమి రాజకీయం మరో మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం శ్రీకాళహస్తి మాజీ జనసేన(janasena) ఇన్చార్జ్ కోటా వినుతకు(Kota Vinutha) న్యాయం చేయాలి అని సోషల్ మీడియా వేదికగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పోస్ట్ పెట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. దీంతో, ఆ పోస్టు వైరల్‌గా మారింది. సుధీర్ రెడ్డి వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. అనంతరం, కూటమి ఎమ్మెల్యేపైనే పోస్టు చేశారన్న కారణంగా జనసేన నేత వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇలా పోస్టు పెట్టినందుకే అరెస్ట్ చేస్తారా?.. ఏంటి ఈ అన్యాయం అని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా(Vinutha Kotaa) అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(bojjala sudheer reddy) తన ద్వారా వినుత.. ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చర్చకు దారి తీసింది.
ఈ క్రమంలో.. వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారు. మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిల్ ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు.

.. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతాం. ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్‌తో బయటకు వస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్ అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలుగానీ, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం చర్చనీయాంశమైంది.