పిఠాపురం రూరల్ : తనకు రావాల్సిన ఆస్తి అడుగుతుంటే తన మామ, జనసేన నాయకుడు అయిన గరగ సత్యానందం వేధింపులకు గురి చేస్తున్నారని పిఠాపురం మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి ఆరోపించారు. తనకు న్యాయం కావాలని, తన కుమార్తెతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా తనకు రావలసిన ఆస్తి హక్కులను కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త గరగ జగన్నాథ్ 2021లో కోవిడ్తో మరణించారని, భర్త మరణానంతరం తనను మానసికంగా, ఆర్థికంగా మామ సత్యానందం వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన పిఠాపురం జనసేన నాయకుడు కావడంతో జనసేన కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కుమార్తెను పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కృష్ణ స్వాతి తెలిపారు.
భర్త చనిపోయిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, మామగారే కదా అని నమ్మి సంతకం పెట్టానని, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు. స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా మామ సత్యానందానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, చేబ్రోలులోని పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశానని, హైదరాబాద్లో పవన్ నివాసానికి రెండుసార్లు వెళ్లానని అయినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన చిన్న కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.


