చిత్తశుద్ధి ఉంటే లోకేశ్ తక్షణం రాజీనామా చేయాలి
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం: డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మెగా స్కామ్‌కు తెర తీసిందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మంగళవారం మాట్లాడారు. డీఎస్సీ–2025పై అభ్యర్థుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చిత్తశుద్ధి ఉంటే పదవికి రాజీనామా చేసి డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జిమ్మిక్కులు, స్కామ్‌లు చేయడంలో సిద్ధహస్తులని, ప్రజలను, నిరుద్యోగులను మోసం చేయడం అనేక సందర్భాల్లో చూశామని చెప్పారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ 6,500 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే నానా యాగీ చేసిన చంద్రబాబు, పవన్, లోకేశ్.. తాము అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్భాలు పలికారన్నారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ నిర్వహించారని మండిపడ్డారు. నిరుద్యోగుల నోట్లో మన్ను కొటా్టరని, డీఎస్సీ అభ్యర్థులు పడిన కష్టాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తనకు వచ్చిన ర్యాంకులపై కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం మెరిట్ జాబితాను వెబ్‌సైట్ నుంచి తొలగించడం డీఎస్సీలో అవకతవకలకు నిదర్శనమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3.36 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ రాస్తే 16,430 మందికి మాత్రమే సెలెక్టెడ్ మెసేజ్‌లు పంపించడం, మెరిట్ జాబితాలు అందుబాటులో ఉంచకపోవడం దుర్మార్గమన్నారు. వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్టులు మాయం చెయ్యడం, రోస్టర్ విధానం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే మంత్రి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీలో పోస్టులను వేలం పెట్టి మరీ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు బేరాలు ఆడిన ఆడియోల టేపులు బహిర్గతం కావడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఆడియో టేపుల లీకేజ్‌పై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమన్నారు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఆయనకు తెలియకుండానే డీఎస్సీలో ఇన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే యువజన విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


