విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

Interruption of power supply Andhra Pradesh - Sakshi

213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

శరవేగంగా సబ్‌ స్టేషన్లు, ఫీడర్ల మరమ్మతులు, స్తంభాల ఏర్పాటు

సాక్షి, అమరావతి/అరసవల్లి: గులాబ్‌ తుపాను కారణంగా తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల పరిధిలో సంస్థకు వాటిల్లిన ప్రాథమిక నష్టం రూ.7.87 కోట్లుగా అధికారులు తేల్చారు. 213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాన్‌ ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడ భారీ నష్టం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల్లో ఒక ఎక్స్‌ట్రా హైటెన్షన్‌ సబ్‌ స్టేషన్‌తో పాటు 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు 380, ఫీడర్లు 276, స్తంభాలు 107, లైన్లు 10 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 1,623, స్తంభాలు 1,120, లైన్లు 51.19 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించి 66.58 కిలోమీటర్ల  మేర, ఎల్టీ కేటగిరిలోనే 1,719 స్తంభాలు, 678 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమైనట్టు ఏపీఈపీడీసీఎల్‌ సిబ్బంది గుర్తించారు. తుపాను వల్ల 24 పట్టణాలు, 103 మండలాలు, 3,821 గ్రామాల్లో 11,26,959 వ్యవసాయేతర, 4,767 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

శరవేగంగా పునరుద్ధరణ పనులు
ముందస్తు ప్రణాళిక ప్రకారం పునరుద్ధరణ పనులు మొదలుపెట్టిన విద్యుత్‌ శాఖ ఈహెచ్‌టీ సబ్‌ స్టేషన్, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 364, ఫీడర్లు 255, స్తంభాలు 75, లైన్లు 5.5 కిలోమీటర్ల మేర బాగు చేశారు. 11 కేవీ ఫీడర్లు 1,255, స్తంభాలు 390, లైన్లు 23.35 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 18.55 కిలోమీటర్లు, ఎల్టీ పోల్స్‌ 403, ట్రాన్స్‌ఫార్మర్లు 154 చొప్పున మరమ్మతులు పూర్తి చేశారు. 8,85,419 వ్యవసాయేతర, 1,463 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. మంగళవారం ఉదయానికల్లా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్‌ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, మిగిలిన జిల్లాల్లో కొన్నిగంటలపాటు అంతరాయం ఏర్పడిందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top