చంద్రబాబు పర్యటనలో.. తమ్ముళ్ల వర్గపోరు | Internal Clash Between TDP Party Leaders in Vizianagaram | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పర్యటనలో.. తమ్ముళ్ల వర్గపోరు

Jun 18 2022 12:29 PM | Updated on Jun 18 2022 2:30 PM

Internal Clash Between TDP Party Leaders in Vizianagaram - Sakshi

చంద్రబాబు బస ప్రాంతంలో వేర్వేరు గ్రూపులుగా కూర్చున్న అశోక్, కళావెంకటరావు వర్గాలు

సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే తమ్ముళ్ల వర్గపోరు బట్టబయలైంది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లిలో నిర్వహించిన రోడ్డు షో సాక్షిగా తమ బలాబలాల నిరూపణకు సిద్ధమయ్యారు. గ్రూపు తగాదాలను తెరపైకి తెచ్చారు. స్వాగత ఏర్పాట్లు మొదలు పర్యటన ఆద్యంతం రెండు నియోజకవర్గాల్లో ఎవరికి వారే అన్నట్లు నేతలు వ్యవహరించారు. ఇక విజయనగరంలో పూసపాటి అశోక్‌ గజపతిరాజుతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు సయోధ్య కుదరలేదు. దీంతో ఆరోగ్య కారణం చూపించి అధినేత పర్యటనకు ఆమె డుమ్మా కొట్టినట్టు తెలిసింది.  


నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం మండలంలో ఉన్న సన్‌రే రిసార్ట్సులో చంద్రబాబు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ బస చేశారు. అక్కడ నుంచి ఆయన పర్యటన ప్రారంభానికి ముందు టీడీపీ నాయకులు చాలామంది అక్కడకు వెళ్లారు. ఆయన బయటకు వచ్చేవరకూ దాదాపు మూడు గంటల సేపు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ చుట్టూ ఒక గ్రూపు, వారికి కొంత దూరంలో రాష్ట్ర మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు చుట్టూ కొంతమంది నాయకులు సిట్టింగ్‌ వేశారు. అశోక్‌ గ్రూప్‌లో సుజయకృష్ణ రంగారావు, ఆర్‌పీ భంజ్‌దేవ్, శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమార్తె పావని తదితర ఉన్నతవర్గ నాయకులు కనిపించారు. వారితో పాటే ఎస్‌.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీష్‌ మాత్రమే కూర్చున్నారు.

చదవండి: (Konaseema: కోనసీమలో సాగుకు శ్రీకారం)
 
కళావెంకటరావు గ్రూపులో మాజీ మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కిమిడి గణపతిరావు, తెంటు లకు‡్ష్మనాయుడుతో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. తర్వాత అక్కడకు వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు ఆ రెండు శిబిరాల దగ్గరకూ వెళ్లి నేతలకు ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. 

గీతకు దక్కని భరోసా... 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనైనా తనకు విజయనగరం టికెట్‌ వస్తుందనే ఆశతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇటీవల తాడేపల్లిలో చంద్రబాబు ముందు పంచాయితీ (నియోజకవర్గ సమీక్ష)కి వెళ్లారు. తీరా ఆయన ఏమీ తేల్చకుండా అశోక్‌కే పగ్గాలు అప్పగించేశారు. దీంతో కినుక వహించిన గీత... ఇటీవల అశోక్‌ బంగ్లాలో నిర్వహించిన మినీమహనాడుకు గైర్హాజరయ్యా రు. విజయనగరం టీడీపీ వేదికపై మళ్లీ అదితికే ప్రాధాన్యం ఇవ్వడంతో గీత రాజకీయ భవిష్యత్తు కు భరోసా లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా చంద్ర బాబు పర్యటకు ఆమె డుమ్మా కొట్టేశారు. దాసన్నపేట కూడలిలో రోడ్‌షో ఆపి మాట్లేందు కు అశోక్, అదితి ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు జరిగాయి. చంద్రబాబు పక్కన వారిద్దరే ఉన్నారు. గీత రాకపోవడానికి ఆరోగ్యం బాగోకపోవడమే కారణమని ఆమె అనుచరులు చెబుతున్నా అసలు కథ ఆధిపత్య పోరేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.    

చదవండి: (అగ్నిపథ్‌ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం)

అర్ధరాత్రి నుంచి మొదలు... 
గురువారం అర్ధరాత్రి 2.15 గంటల సమయంలో సన్‌రే రిసార్ట్స్‌కు చేరుకున్న చంద్రబాబుకు భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు ఆయన వర్గీయులతో స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాట్లు అన్నీ ఆయనే చూసుకున్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్న డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు వర్గీయులు ఎవరూ అక్కడ కనిపించలేదు. శుక్రవారం ఉదయం మాత్రం చంద్రబాబుకు ఎదురేగి డెంకాడ మండలానికి రాకముందే జాతీయ రహదారి టోల్‌గేట్‌ వద్ద కంది చంద్రశేఖర్‌రావు, ఆయన వర్గీయులు స్వాగతం పలికారు. అదే నెల్లిమర్ల నుంచి టీడీపీ సీటు ఆశిస్తున్న బంగార్రాజుకు పోటీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇద్దరూ వేర్వేరుగానే ఎవరి మండలాల పరిధిలో వారు బైక్‌ ర్యాలీ చేశారు. వారిద్దరినీ కాదని తనకు ఏమైనా నెల్లిమర్ల టికెట్‌ వస్తుందేమోనని కడగల ఆనంద్‌ నెల్లిమర్లలో సభ, ఇతరత్రా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇలా మూడు మండలాల్లో ముగ్గురు నాయకులు వేర్వేరుగా అధినేత ముందు తమ‡బల ప్రదర్శన నిరూపణకు భారీగానే చేతిచమురు వదిలించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement