ఘన చరితం.. రేనాటి శాసనం

Inscription Of Chola King Of Renati Which Came To Light In YSR District - Sakshi

చిన్న దుద్యాలలో వెలుగుచూసిన రేనాటి చోళరాజు శాసనం

పరిశోధకులు డాక్టర్‌ వి. రామబ్రహ్మంను అభినందించిన వైస్‌ చాన్సలర్‌ 

వైవీయూ: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామ సమీపంలో లభించిన శాసనం ఆధారంగా చోళ మహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన సాగించినట్లు రూఢీ అయిందని వైవీయూ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి అన్నారు. బుధవారం వైవీయూ చరిత్ర, పురావస్తుశాఖ పరిశోధకులు, సహాయ ఆచార్యులు డాక్టర్‌ వి. రామబ్రహ్మం రేనాటి చోళరాజు శాసనం వివరాలను, దాని వెనుక ఉన్న చరిత్ర సంగతులను వైస్‌ చాన్సలర్‌ దృష్టికి తీసుకువచ్చారు. చిన్నదుద్యాల సమీపంలో లభించిన రేనాటి చోళరాజు శాసనం అత్యంత అరుదైనదన్నారు. ఆ గ్రామానికి చెందిన బి.శివనారాయణరెడ్డి పొలంలో ఇది బయల్పడినట్లు తెలిపారు. వైవీయూ ఎంఏ చరిత్ర, పురావస్తుశాఖ విద్యార్థి వాసుదేవరెడ్డికి ముందుగా ఈ విషయం తెలియడంతో ఆయన డా. రామబ్రహ్మం దృష్టికి తీసుకువచ్చారు. శాసనం, ఆ సమాచారాన్ని మైసూర్‌లోని భారత పురాతత్వశాఖ(ఏఎస్‌ఐ)కు తెలియజేశారు. ఏఎస్‌ఐ, వైవీయూ చరిత్ర పురావస్తుశాఖ పంపిన శాసనం గురించి అధ్యయనం చేయగా పలు చారిత్రక అంశాలు వెలుగుచూశాయని ఆయన తెలిపారు. 

►రేనాటి చోళుల రాజైన చోళమహారాజు ఈ శాసనం వేయించారు. అందులో (తొలితరం) తెలుగుభాష, తెలుగు లిపిలో క్రీ.శ. 8వ శతాబ్దంలో శాసనం వేయించినట్లు ఉంది. పిడుకుల గ్రామంలోని దేవాలయాన్ని దేవాలయ బ్రాహ్మణులకు ఆరు మర్తల (8పుట్ల ధాన్యం పండేభూమి) సేద్యానికి ఇచ్చినట్లు నమోదై ఉంది. అలానే ఈ శాసనంలో చోళమహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన కొనసాగించినట్లు తెలుస్తోంది. ఎవరైతే ధాన్యాన్ని పరిరక్షిస్తారో వారికి (శాసనంలో లైన్‌ నెంబర్‌ 21, నవారికి ఆశ్వ : 22 లైన్‌లో మేద : (ం) బుదీని’ ఉంది) అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని, ఎవరైతే హానిచేస్తారో వారు వారణాసిలో చంపిన పాపాన్ని (23. చెర్రివారు, 24 బారనసి ప్ర) పొందుతారని శాసనంలో లిఖించారు. 
►పరిశోధకులు డాక్టర్‌ రామబ్రహ్మంను వైవీయూ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్‌ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్‌లు అభినందించారు. వైవీయూ అధికారుల ఆదేశానుసారం ‘ఎక్స్‌ఫ్లోరేషన్‌ ఆఫ్‌ ఆన్‌ – ఎర్త్‌డ్‌ ఇన్‌స్క్రిప్షన్, స్ల్కప్ఫర్‌ అండ్‌ టెంప్‌లెస్‌ ఆఫ్‌ వైఎస్‌ఆర్‌ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ పేరుతో యూనివర్సిటీ గ్రాంటు కమిషన్‌కు ప్రాజెక్టును పంపనున్నట్లు డాక్టర్‌ రామబ్రహ్మం తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top