బదిలీల్లో బ‘లిస్టులు’ | Increased demand for permanent category posts with rationalization | Sakshi
Sakshi News home page

బదిలీల్లో బ‘లిస్టులు’

Jun 26 2025 5:41 AM | Updated on Jun 26 2025 5:41 AM

Increased demand for permanent category posts with rationalization

గ్రామ, వార్డు సచివాలయ బదిలీల్లో కూటమి ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం

రేషనలైజేషన్‌తో శాశ్వత కేటగిరి పోస్టులకు పెరిగిన డిమాండ్‌   

ఇదే అదనుగా కూటమి నేతల బరితెగింపు  

ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు 

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలదే ఇష్టారాజ్యమైంది. ఉద్యోగులను కూటమి నేతలు ముప్పుతిప్పలు పెడుతున్నారు. బదిలీ కో­సం తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నా­రు. అడిగినంత డబ్బు ఇస్తేనే బదిలీ అని తెగేసి చెబుతున్నారు. దీనికితోడు బదిలీకి ఎమ్మెల్యే లేఖ తప్పనిసరి అని ఉన్నతాధికారులు తేల్చి చెప్పడంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు వచ్చాక  సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, తమకు కనీస గౌరవం ఉండడం లేదని ఆక్రోశిస్తున్నారు. తప్పక కూటమి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

గ్రామాల్లో స్థానిక టీడీపీ నేతల సిఫార్సుల మేరకు ఎమ్మెల్యేలు ఏ సచివాలయంలో ఏ కేటగిరి ఉద్యోగి ఎవరు ఉండాలన్నది సూచిస్తూ చాంతాడంత జాబితాలను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో కూడా కొనసాగుతున్న పశ్చిమ గోదావరి జి­లా్లకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక్క సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులకే 40 మంది పేర్లను సూచిస్తూ ఆ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

రేషనలైజేషన్‌తో ఉద్యోగుల సంఖ్య పరిమితం చేయడం వల్లే..  
గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో 10 నుంచి 11 మంది చొప్పున ఉద్యోగులు ఉండేవారు. కూటమి ప్రభుత్వం ఇటీవల రేషనలైజేషన్‌ పేరుతో సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా 6 నుంచి 8 మంది చొప్పున ఉద్యోగులను శాశ్వతంగా కొనసాగించేలా.. ఏ సచివాలయంలో ఏ కేటగిరి ఉద్యోగులు పనిచేయాలో నిర్ణయించింది. దీంతో సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. రేషనలైజేషన్‌తో శాశ్వతంగా ఉండే పోస్టులకు తొలుత బదిలీలు చేపట్టి, ఆ తర్వాత ఇంకా మిగిలిపోయిన ఉద్యోగుల విష­యంలో ప్రభుత్వం తదుపరి ఆదేశాల మేరకు సర్దుబాటు చేసేలా బదిలీ ప్రక్రియ చేపట్టడంతో ఉద్యో­గుల మధ్య పోటీ నెలకొంది. 

శాశ్వతంగా కొనసాగే పోస్టులకు డిమాండ్‌ పెరిగింది.  గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 72 వేల మంది తప్పనిసరిగా బదిలీ కానుండడంతో వారు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని అధికార పార్టీ నేతలు పైరవీలకు తెరలేపారని, బేరసారాలు సాగుతున్నాయని సమాచారం. సచివాలయ ఉద్యోగులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అధికారపార్టీ నేతలకు రూ.లక్షల్లో ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. 

గత ప్రభుత్వ పారదర్శకత భేష్‌  
గతంలో ఇలాంటి పైరవీలు చూడలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభు­త్వం  గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టింది. ఎలాంటి పైర­వీలకు, అక్రమాలకు తావులేకుండా తాము ఉద్యో­గాలు పొందామని ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బదిలీలకు అడిగినంత ముట్ట­జెప్పాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వ పారదర్శకత భేష్‌ అని పేర్కొంటున్నారు.   

ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో కొత్త ట్విస్టు  
గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఎనర్జీ అసిస్టెంట్ల బదిలీపై విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆఖరి నిమిషంలో కొత్త ట్విస్టు ఇచ్చాయి. ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం  గ్రేడ్‌ –2) గ్రామ, వార్డు సచివాలయ శాఖ రేషనలైజేషన్‌ ప్రక్రియ పరిధిలోకి రారంటూ ఏపీ ఈపీడీఎస్‌ఎల్‌ సీజీఎం మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, గ్రామ వార్డు సచివాలయాల శాఖ చేపట్టిన రేషనలైజేషన్‌లో ఎనర్జీ అసిస్టెంట్లనూ పరిగణనలోకి తీసుకుని ఒక్కో సచివాలయంలో ఆరు నుంచి 8 మంది చొప్పున ఉద్యోగులను శాశ్వతంగా ఉండేలా వర్గీకరించారు. 

ఈ నేపథ్యంలో విద్యుత్‌ డిస్కంలు జారీ చేసిన ఆదేశాలతో బదిలీ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని ఉద్యోగ సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. విద్యుత్‌ డిస్కంల ఆదేశాలు తమ దృష్టికి రాలేదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ జీఓ మేరకు రేషనలైజేషన్, బదిలీల ప్రక్రియ కొనసాగిస్తామని, ఇతర శాఖల అంతర్గత మెమోలు, సర్క్యులర్ల విషయం ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పష్టం చేస్తున్నారు. 

విద్యుత్‌ డిస్కంల తరహాలోనే వీఆర్వోల విషయంలో రేషనలైజేషన్‌ పేరుతో ఎలాంటి రీ–ఆర్గనైజ్‌ ప్రక్రియ చేపట్టవద్దని, అలా చేస్తే రీసర్వే వంటి పనులకు ఆటంకం కలుగుతుందని  గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సూచిస్తూ గత మే 19న రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్, సీసీఎల్‌ఏ జయలక్ష్మి యూవో నోట్‌ను జారీ చేశారు. తాజాగా విద్యుత్‌ డిస్కంల ఆదేశాల నేపథ్యంలో సీసీఎల్‌ఏ జారీ చేసిన నోట్‌నూ వీఆర్వోలు సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement