సీఎం చలించిపోయారు  | Increase in compensation to railway accident victims | Sakshi
Sakshi News home page

సీఎం చలించిపోయారు 

Nov 1 2023 4:24 AM | Updated on Nov 1 2023 4:24 AM

Increase in compensation to railway accident victims - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రైల్వే ప్రమాదంలో గాయపడ్డవారి పరిస్థితిని చూసి చలించిపోయారు. తొలుత రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డవారిని సోమవారం స్వయంగా పరామర్శించిన అనంతరం ఎక్స్‌గ్రేషియాను పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రూ.2.59 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కులను గాయపడ్డ  30 మందికి మంగళవారం విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి అందజేశారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

రైలు ప్రమాదంలో 13 మంది మృతుల కుటుంబాలకు సంబంధించిన ఎక్స్‌గ్రేషియాను వారి ఇంటికి తీసుకెళ్లి  కుటుంబసభ్యులకు సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. రైల్వే ప్రమాదంలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందజేస్తామని చెప్పారు. 13 మంది మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, 30 మంది గాయపడ్డ వారి గాయాల తీవ్రతను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ  ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందని వివరించారు. స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న 12 మందికి రూ. 2 లక్షల చొప్పున, తీవ్ర గాయాలతో నెలకు మించి చికిత్స అవసరమైన 15 మందికి రూ. 5 లక్షల చొప్పున మంజూరైనట్టు వివరించారు.

తీవ్ర గాయాలతో వైకల్యం పొందిన ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెంచారని వెల్లడించారు. వారి పరిస్థితిని చూసి సీఎం ఎంతో చలించిపోయారని, పరిహారం విషయంలో ఎంతో ఉదారంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.  విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అనిలా సునందని, డీఎంహెచ్‌ఓ  డాక్టర్‌ భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ బి.గౌరీశంకర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మలీల తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement