భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య | incident in Kakinada: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య

May 18 2026 4:39 AM | Updated on May 18 2026 4:39 AM

incident in Kakinada: Andhra Pradesh

కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసు­కుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ జి.సతీష్‌ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్‌ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.

కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement