పార్క్ స్థలంలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలు
తిరుపతి రూరల్ మండలం పుదిపట్లలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
స్థానిక ఎమ్మెల్యే బంధువునంటూ ఓ టీడీపీ నేత దౌర్జన్యం
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గుడి, బడి, ప్రభుత్వ స్థలాలు.. ఇలా దేన్నీ వదలకుండా ఆక్రమించేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీకి కేటాయించిన రూ.10 కోట్ల విలువజేసే 1.57 ఎకరాల పార్క్ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు ఆక్రమించి పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్క్ స్థలం కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిస్తున్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి సమీప బంధువునని చెబుతుండడం వల్ల సదరు ఎమ్మెల్యే స్పందించి నిర్మాణ పనులను నిలిపివేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పుదిపట్ల గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 558లో ఉన్న దరఖాస్తు పట్టా భూమిని గతంలో ఓ ప్రైవేట్ వెంచర్ సంస్థ అభివృద్ధి చేసి పార్క్‌కు కేటాయించినట్టు సమాచారం. ఆ స్థలంపై చాలాకాలం నుంచి కన్నేసిన స్థానిక టీడీపీ నేత ఇప్పుడు అధికార బలంతో స్వా«దీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు తిరుపతి కోర్టును ఆశ్రయించగా, అది పార్కు స్థలమేనని కోర్టు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.
అయినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా రికార్డులు మార్చి ఆక్రమణదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని, ఆ స్థలంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నందున కింది కోర్టు ఆదేశాలు ధిక్కరణ కింద చర్యలు కోరతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.


