మరణంలోనూ కలిసే పయనం | Husband And Wife Ends Life In Road Incident | Sakshi
Sakshi News home page

మరణంలోనూ కలిసే పయనం

Apr 7 2026 7:28 AM | Updated on Apr 7 2026 7:51 AM

Husband And Wife Ends Life In Road Incident

కొంగుముడులు వేసుకుని, ఏడడుగులు నడిచి, నాతిచరామి అంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ రెండు జంటలూ బహుశా మరువలేదేమో! కడవరకూ కలిసే తమ పయనాన్ని సాగించాయి. మరణంలోనూ పరస్పరం వీడలేక.. కానరాని లోకాలకు వెళ్లిపోయాయి. బంధువుల ఇంట జరిగిన శుభకార్యంలో ఆనందంగా గడిపి.. కారులో తిరుగు ప్రయాణమైన ఓ జంట.. తమ బిడ్డకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో హైదరాబాద్‌ బయలుదేరిన మరో జంట.. వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు సంఘటనలూ అటు కుటుంబ సభ్యుల్లోను, ఇటు స్థానికంగాను తీరని విషాదాన్ని నింపాయి. 

కపిలేశ్వరపురం (మండపేట): బంధువుల ఇంట శుభకార్యంలో అప్పటి వరకూ ఆనందంగా గడిపారు. ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. వారు ప్రయాణిస్తున్న కారు రెప్పపాటులో అదుపు తప్పి, కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బోగిళ్ల వీర వెంకట సతీష్‌ (40), కిరణ్మయి (36) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుల పిల్లలు, తల్లిదండ్రులను స్థానికులు కాపాడారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..  

మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన వీర వెంకట సతీష్‌ రాజమహేంద్రవరం పేపర్‌ మిల్లులో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వెలగతోడులోని చిన్నాన్న కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 3న కాకినాడ వెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఫస్ట్‌నైట్‌ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ నుంచి కారులో స్వగ్రామం వెలగతోడు బయలుదేరారు. సతీష్‌ కారు నడుపుతూండగా ముందు సీటులో భార్య కిరణ్మయి, వెనుక సీట్లలో తండ్రి వెంకట్రావు, తల్లి పద్మ, పదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, ఏడేళ్ల కుమారుడు జితేష్‌ ఉన్నారు.

ఏం జరిగిందో ఏమో కానీ పేకేటిపాకలు – వెలగతోడు రోడ్డులో పేకేటి పాకలు శివారున కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారు ముందు భాగం లోతు నీళ్లలోకి కూరుకుపోవడంతో సతీష్‌ కిరణ్మయి దంపతులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.   ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి, పైకి కనిపిస్తున్న భాగంలోని కారు అద్దాలు పగులగొట్టి చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్‌ తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మలను కాపాడారు. సమాచారం అందుకున్న మండపేట రూరల్‌ సీఐ పి.దొరరాజు, రూరల్‌ ఎస్సై వి.కిశోర్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ దొరరాజు తెలిపారు.  

కళ్ల ముందే జలసమాధి 
తమ ఒక్కగానొక్క కొడుకు సతీష్, ప్రేమానురాగాలతో చూసుకునే కోడలు కిరణ్మయి తమ కళ్ల ముందే జలసమాధి కావడాన్ని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మ జీరి్ణంచుకోలేకపోయారు. చీకట్లో సాగిన ప్రయాణం తమ కుటుంబాన్ని విషాదంలోకి నెడుతుందని ఏమాత్రం ఊహించలేదని బావురుమన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్‌ లు అమ్మా నాన్నా ఏరని అడుగుతూంటే ఏం చెప్పాలో దిక్కు తోచడం లేదంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుభకార్యంలో సందడిగా గడిపిన కొడుకు, కోడలు కానరాని లోకానికి వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా విలపించారు. చిరునవ్వుతో ప్రేమగా పలకరించిన సతీష్‌ దంపతుల పలకరింపులు ఇంకా మరువక ముందే దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఆ దంపతుల మృతదేహాలను చూసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement