అనధికార కోతలను బయటపెట్టిన మంత్రులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలపై వరుసగా ఇంధన కష్టాలు దాడి చేస్తున్నాయి. గ్యాస్ కష్టాలు, పెట్రోల్, డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకు ఇప్పుడు విద్యుత్ కోతలు తోడయ్యాయి. ఓ వైపు అనధికార విద్యుత్ కోతలు విధిస్తూ, మరోవైపు నిరంతరం సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది అబద్దమని సాక్షాత్తూ మంత్రులే బయటపెట్టడం విశేషం. డీజిల్ సరఫరాలో విఫలమైన చంద్రబాబు సర్కారు దాని నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. ‘ఆర్డీఎస్‌ఎస్’ పనుల పేరుతోనూ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు బయటపెట్టిన నిజం
కొద్ది రోజులుగా రాష్ట్రంలో విపరీతంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రాయల సీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపాలతో ఉత్పత్తి నిలిచిపోతోంది. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో విద్యుత్ కొరత ఏర్పడి కోతలు అనివార్యమవుతున్నాయి. దీనిని ప్రభుత్వంగానీ, ఇంధన శాఖ అధికారులుగానీ ధృవీకరించడం లేదు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు అమలు చేయడం లేదని, సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని బుకాయిస్తున్నారు. కానీ ‘‘ఆక్వా కల్చర్ రంగానికి రోజుకి సగటున 2గంటలు విద్యుత్ కోత ఉంది’’ అని సాక్షాత్తూ కూటమి ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా వెల్లడించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నామని స్వయంగా మంత్రులే వెల్లడించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
ఆక్వాతోపాటు గృహాలకూ పవర్ కట్
మంత్రి చెప్పినట్లు ఆక్వా రంగానికి రోజుకు సగటున రెండు గంటలు కాదు అంతకు మించి సరఫరా తగ్గింపు అమలు చేస్తుండగా, గృహ విద్యుత్ వినియోగదారులు రోజులో కనీసం 2 నుంచి 4 గంటలు విద్యుత్ కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పీక్ అవర్స్‌లో అంటే విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయాల్లో పవర్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కోతలు విధిస్తున్నారు. వినియోగదారులు అధికారులకు ఫోన్లు చేసి అడిగితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్‌ఎస్)లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు వంటివి మారుస్తున్నందున ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో ఈ సమస్య అత్యధికంగా ఉంది.
కొరతను దాచేందుకు కాకి లెక్కలు
రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి 270.578 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. గరిష్ట డిమాండ్ 13,793 మెగావాట్లకు చేరింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి గతంలో 120 మిలియన్ యూనిట్ల వరకూ ఉండగా, ఇప్పుడు 91.944 మిలియన్ యూనిట్లు మాత్రమే జరుగుతోంది. జల విద్యుత్ కేవలం 5.516 మెగావాట్లు వస్తోంది. అధికారికంగా లోడ్ రిలీఫ్ లేదంటూనే అనధికార కోతలు విధిస్తూ డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ కొరత ప్రభావంతో బహిరంగ మార్కెట్‌లో రాష్ట్ర అవసరాలకు రోజూ 38.750 మిలియన్ యూనిట్లు కొంటున్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్‌లో రాత్రిపూట విద్యుత్ ధర యూనిట్‌కు రూ.10కి చేరింది. దీంతో రాత్రి వేళ మన రాష్ట్రం కొనడం లేదు. పగటి వేళ మాత్రం యూనిట్ రూ.4 చొప్పున కొంటున్నారు. దీని కోసం రోజూ రూ.8.355 కోట్లు వెచ్చిస్తున్నారు.


