
సాక్షి, ఒంగోలు: దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఒకటైన మహానందినిని దర్శనం చేసుకుని కారులో ఇంటికి వెళ్తున్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది. బాధితుల కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శైవక్షేత్ర దర్శనం అనంతరం మహానంది నుంచి చీరాల వెళ్తున్న ప్రయాణికుల కారు కోమరోలు మండలం తాటిచెర్లమోటు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.
రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీని బాధితులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కార్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించే ప్రయత్నించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాద తీవ్రత కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు ఘటన స్థలంలో మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతుల వివరాలు
గజ్జల నరసింహ (33), బచ్చు సందీప్ అలియాస్ సన్నీ(30),గజ్జల బబ్లు(29), కర్రెద్దుల దివాకర్ అలియాస్ చిన్ని,గజ్జల భవాని (20)గజ్జల అంకాలుగా పోలీసులు గుర్తించారు.